తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. తిరుపతిలో ట్రాఫిక్ సమస్యలను తీర్చడం కోసం శరవేగంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల్లో భాగంగా సిమెంట్ సెగ్మెంట్ అమర్చుతుండగా హఠాత్తుగా క్రేన్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఓ భారీ సిమెంట్ సెగ్మెంట్ కింద పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు వెస్ట్ వెస్ట్ బెంగాల్, బీహార్ కు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో పశ్చిమ బెంగాల్ కు చెందిన 22 ఏళ్ల అవిజిత్ ఘోష్ కాగా మరొకరు బీహార్ కు చెందిన 44 ఏళ్ల బొల్డా మండల్ గా గుర్తించారు.
వాస్తవానికి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పనులు మొత్తం మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని భావించారు. ప్లై ఓవర్ పనులు చివరి దశలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అక్కడ విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ఘటన స్థలానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సహా పోలీసులు, అధికారులు చేరుకున్నారు. మృత దేహాలను ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలియజేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..