వారందరిది చాలా చిన్న వయసు. పట్టుమని 16 ఏళ్లు కూడా నిండలేదు. పసితనపు ఛాయలు ఇంకా వాడిపోలేదు. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇక జీవితమే లేదనే భ్రమపడ్డారు. 15 ఏళ్ల ప్రాయంలోనే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ప్రస్తుత అవగాహన కంటే ర్యాంకులకే అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. అందరికంటే బాగా చదవాలి, మొదటి స్థానంలో నిలవాలన్న టార్గెట్‌లతో సతమతమవుతున్నారు. వైఫల్యాలు ఎదురైతే తట్టుకోలేకపోతున్నారు. తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కన్నవారికి తీరని కడుపుకోత మిగులుస్తున్నారు. ఏపీలో తాజాగా వెలుబడిన పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్అయిన ఇద్దరు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు చేసుకున్నారు.
ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డిలో విద్యార్థిని కామేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. పదో తరగతి ఫలితాల్లో ఓ సబ్జెక్టులో కామేశ్వరి ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కామేశ్వరి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కామేశ్వరి మృతితో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అటు శ్రీసత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం నవాబు కోటలో కూడా విషాద ఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ..విద్యార్థిని వలిపి సుభాషిని ఇంట్లో చీరతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పదవ తరగతి పరీక్షా ఫలితాలు చేసిన మంత్రి మంత్రి బొత్స.. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. విద్యార్థులకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని, సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. విద్యా సంవత్సరం కోల్పోకూడదనే ఉద్దేశంతో త్వరగా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..