Andhra Pradesh: సముద్రంలో కొట్టుకొస్తున్న మృతదేహాలు.. బాపట్ల తీరంలో భయం.. భయం..

| Edited By: Shaik Madar Saheb

Feb 10, 2024 | 3:59 PM

సందర్శకులతో సందడిగా ఉండాల్సిన బీచ్‌లలో వరుసగా మృతదేహాలు కొట్టుకొస్తుండటంతో స్థానికులు, టూరిస్టులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బాపట్లజిల్లా వాడరేవు, రామాపురం సముద్రతీరాల్లో రెండు రోజుల వ్యవధిలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి.. కొట్టుకొచ్చాయా..? లేక కొట్టి చంపేశారా..?

Andhra Pradesh: సముద్రంలో కొట్టుకొస్తున్న మృతదేహాలు.. బాపట్ల తీరంలో భయం.. భయం..
Suryalanka Beach
Follow us on

సందర్శకులతో సందడిగా ఉండాల్సిన బీచ్‌లలో వరుసగా మృతదేహాలు కొట్టుకొస్తుండటంతో స్థానికులు, టూరిస్టులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బాపట్లజిల్లా వాడరేవు, రామాపురం సముద్రతీరాల్లో రెండు రోజుల వ్యవధిలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి.. కొట్టుకొచ్చాయా..? లేక కొట్టి చంపేశారా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. మృతదేహాలపై గాయాలు ఉండటం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తున్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో మూడు రోజుల క్రితం ఓ గుర్తు తెలియని మృతుదేహం ఒడ్డుకు కొట్టుకోచ్చింది. మృతదేహాన్ని చూసిన మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహం వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకొచ్చి ఒడ్డుపై వేశారా…? లేక సముద్రంలో పారేశారా..? అన్న కోణంలో విచారిస్తున్నారు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి చూస్తే.. హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

చీరాల న్యాయవాది..

మరోవైపు, రెండు రోజుల క్రితం వాడరేవు పక్కనే ఉన్న రామాపురం సముద్రతీరంలో మరో వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. ఈ మృతదేహం కూడా ఒడ్డుపై పడి ఉంది. మృతదేహాన్ని గమనించిన మత్స్యకారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులకు మృతదేహం చీరాల ప్రాంతానికి చెందిన న్యాయవాది చెన్నుపాటి నాగేశ్వరరావుదిగా గుర్తించారు. మృతుడు నాగేశ్వరరావు ఆత్మహత్య కు పాల్పడ్డాడా… లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా… అన్నది తేలాల్సిఉంది.. నాగేశ్వరరావును కూడా ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వాడరేవు, రామాపురం బీచ్‌లలో రెండు రోజుల వ్యవధిలో రెండు మృతదేహాలు లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడో చంపేసి ఇక్కడకు తీసుకొచ్చి మృతదేహాలను పడేస్తున్నారా..? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులతో పాటు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు కూడా గస్తీ పెంచాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..