Twin Calves: కవల గిత్తలకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు.. కేక్ కటింగ్.. 200 మందికి విందు భోజనం

| Edited By: Janardhan Veluru

May 17, 2022 | 2:41 PM

తమ పెంపుడు జంతువు పట్ల అమితమైన ప్రేమను చూపిస్తూ.. ఏలూరు జిల్లాకు చెందిన వ్యక్తి.. కవల ఆవు దూడలకు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేయించి.. 200 మందికి విందుభోజనాలను కూడా పెట్టారు.

Twin Calves: కవల గిత్తలకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు.. కేక్ కటింగ్.. 200 మందికి విందు భోజనం
Cow Birth Day Celebrations
Follow us on

Twin Calves: ప్రస్తుతం పెంపుడు జంతువులకు పుట్టినరోజు చేయటం చాలా సహజంగా మారింది. కుటుంబ సభ్యులు  కంటే మిన్నగా తమ పెంపుడు జంతువులను ప్రేమించేవారున్నారు. పూర్వం వ్యవసాయ అవసరాల కోసం ఆవులు, ఎద్ధులు ప్రతి రైతు ఇంట్లో ఉండేవి. వాటితో ఫోటోలు దిగి ఫ్రేమ్ కట్టించుకుని రైతు ఇంట్లో గొప్పగా పెట్టకునేవాడు. పట్టణీకరణతో పాటు యాంత్రీకరణ పెరగటంతో రైతు కుటుంబాల్లో సైతం ఆవులు, ఎద్ధులు కనిపించటం లేదు. కాని అవి కనపడితే వాటికి నమస్కరించటం, సెల్ఫీ లు దిగి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేయడం సర్వసాధారణంగా మారింది. ఇక ఏ శుభకార్యక్రమం జరిగినా ఇంటికి ఆవులను అద్దెకు తెచ్చుకునే సంప్రదాయం ఎప్పుడో మొదలైంది. ఇది ప్రస్తుతం చాలా డిమాండ్ ఉన్న వ్యాపారంగా కూడా మారింది. అయితే ఈ తరహా పని చేస్తూనే ఒక వ్యక్తి తన  మూగ జీవాలపెంపకం పట్ల ఆసక్తి కనబరుస్తున్నాడు. ఇటీవల తన ఆవులకు పుట్టినరోజు వేడుకలు సైతం నిర్వహించాడు. అతనికున్న మూగ జీవాలపై ప్రేమ ఓ నూతన ఒరవడికి నాంది పలికింది. తనను ప్రేమగా పెంచుకుంటున్న గోవులను ప్రాణప్రదంగా చూసుకోవడమే కాకుండా వాటికి పుట్టిన రోజు వేడుకలు సైతం మనుషులకు ఏ విధంగా తీసి పోకుండా ఉండే విధంగా చేస్తున్నాడంటే వాటి పట్ల ఆయనకున్న మక్కువ తెలుస్తుంది. అంతేకాక తన దైనందిన జీవితంలో మూగజీవాల బొమ్మలను ఊరేగింపుల కోసం తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఇతను ఏలూరు జిల్లాకు చెందిన వ్యక్తి.

జిల్లాలోని ఇరగవరం మండలం రేలంగి గ్రామం చెందిన మిరియాల బాలకృష్ణ మూగజీవాల పట్ల అమితమైన ప్రేమానురాగాలు చూపుతాడు. గోమాతలను అమితంగా ప్రేమిస్తూ తన దగ్గర ఉన్న ఆవులను గిత్తలను ప్రేమగా చూసుకుంటాడు. తన ఆవుకి పుట్టిన కవల గిత్తలకు అవి జన్మించిన జన్మ నక్షత్రం బట్టి పేర్లు కూడా పెట్టారు. రెండు గిత్తలను ఒకదానికి లీలా అని, మరో దానికి లీలా కృష్ణ అని నామకరణం చేశారు. అంతేకాక వాటి పుట్టినరోజు వేడుకలు మనుషులకు తీసిపోని విధంగా ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ వాటి ముందు ఉంచి, కట్ చేసి ప్రేమగా వాటికి తినిపించారు.

అంతేకాక గిత్తల పుట్టినరోజు సందర్భంగా సుమారు 200 మందికి విందుభోజనాలు కూడా పెట్టారు. అయితే బాలకృష్ణ జీవనోపాధికోసం ఓ గ్యారేజీ నిర్వహిస్తారు. ఆ గ్యారేజీలో వివాహ, శుభ కార్యాలు, జాతర్లలో ఊరేగింపుల కోసం హంస, గుర్రాలు, ఏనుగు, ఎడ్లబండి శ్రీ మహావిష్ణువు శేష వాహనం, పుంగనూరు గిత్తల బొమ్మలతో కూడిన వాహనాలను అద్దెకు ఇస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద ఎత్తున ఈ జంతువుల వాహనాలను ఊరేగింపులు కోసం వినియోగిస్తున్నారు. ఇలా మూగజీవాలపై ప్రేమను చూపుతూ.. మరోవైపు వాటి బొమ్మలను తయారుచేసి ఊరేగింపుల్లో ఉపయోగించి పలువురి ప్రశంసలు పొందుతున్నారు బాలకృష్ణ.

ఇవి కూడా చదవండి

(రిపోర్టర్ : బి. రవి కుమార్, ఏలూరు)

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..