Cyclone Asani : అసని పంజాతో రైతుగుండె చెరువు.. ఉప్పు మొదలు పప్పు, బియ్యం వరకు ఊడ్చేసింది..

ఒక్క వరి పంటే కాదు ఉద్యానవన పంటలను సైతం అసని తుఫాను అల్లకల్లోలంగా మార్చింది. అనంతపురం నుంచి మొదలుకొని, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ఉభయగోదావరి, విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అసని తుఫాను సృష్టించిన బీభత్సంతో రైతన్న గుండె చెరువయ్యింది.

Cyclone Asani : అసని పంజాతో రైతుగుండె చెరువు.. ఉప్పు మొదలు పప్పు, బియ్యం వరకు ఊడ్చేసింది..
Cyclone Asani
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2022 | 5:09 PM

ఒకటి కాదు రెండు కాదు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో చేతికొచ్చే పంట నేలపాలైంది. అసని తుఫాను రైతన్న ఆశలను అడియాశలు చేసింది. లక్షలాది ఎకరాల్లో వరిపంట నీటిపాలైంది. ఒక్క వరి పంటే కాదు ఉద్యానవన పంటలను సైతం అసని తుఫాను అల్లకల్లోలంగా మార్చింది. అరటి, మామిడి పంటలను సైతం తుఫాను బీభత్సం తుడిచిపెట్టేయడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో దిగాలుపడివుంది. అనంతపురం నుంచి మొదలుకొని, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ఉభయగోదావరి, విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అసని తుఫాను సృష్టించిన బీభత్సంతో రైతన్న గుండె చెరువయ్యింది. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో వందల ఎకరాల్లోని అరటి, మొక్కజొన్న తోటలు ధ్వంసం అయ్యాయి. తుఫాను ధాటికి ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో బొప్పాయి, మామిడి, అరటి పంటలు సర్వనాశనం అయ్యాయి. దక్షిణ కోస్తాలో వర్షం కంటే ఈదురు గాలుల కారణంగా అధిక నష్టం వాటిల్లింది.

తూర్పు గోదావరి జిల్లాని తుఫాన్ తీవ్రంగా దెబ్బతీసింది. భారీవర్షంతో కూడిన ఈదురుగాలులకు వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో నూర్పిడి చేసిన 60 శాతం ధాన్యం కల్లాల్లోనే ఉంది. వరి ధాన్యం కల్లాల్లోనే మొలకలెత్తుతోన్న స్థితి రైతన్న కంటతడిపెట్టిస్తోంది. కోనసీమలో అరటి, దొండ పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అసలే ఈ యేడాది మామిడి పంట చాలా తక్కువ. ఉన్న పంటను కాపాడుకొని, నష్టాలు పూడ్చకుందామనుకున్న రైతు ఆశలు అసని తుఫాను ఆవిరిచేసింది. అకాల వర్షాలు అన్నదాతకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళాయి. కోతకొచ్చిన పంట మట్టిపాలైంది. పంటను కాపాడుకునేందుకు రైతన్నలు పడిన కష్టానికి ఫలితం లేకుండాపోయింది. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు , గుడ్లూరు మండలాల్లోని రైతులను అసని తుఫాను తీవ్రంగా దెబ్బతీసింది. ఉలవపాడు మండలంలోని వీరేపల్లి గ్రామంలో సుమారు 200 మంది రైతులు వరిపంటను సాగు చేశారు. అసని తుఫాన్ ధాటికి కందుకూరు నియోజకవర్గం లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరికొద్ది రోజుల్లో చేతికొచ్చేపంట మట్టిపాలవడంతో రైతన్న కంటకన్నీరొలుకుతోంది.

అనంతపురం జిల్లాలో అసని ఎఫెక్ట్ రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.. తుఫాను బీభత్సం అనంతపురంలోని పలు ప్రాంతాల్లో భారీగా నష్టం జరిగింది. గత మూడు రోజులుగా వీస్తోన్న పెనుగాలులకు, వర్షానికి పంటలు నీట మునిగాయి..కళ్యాణదుర్గం కూరాకులతోట గ్రామంలో అరటి తోటలు ధ్వంసమయ్యాయి..శెట్టూరు మండలంలో గాలి వానకు చెట్లు నేలకొరిగాయి. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షాలు, ఈదురుగాలులు కర్నూలు జిల్లా రైతులను మరోసారి తీవ్రంగా దెబ్బతీశాయి. కర్నూలు జిల్లాలో ఉద్యానవన పంటలు వేసిన రైతులను అసని తుఫాను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. అరటి, బొప్పాయి, వరి, నిమ్మ, జామ పంటలు నేలకొరిగాయి. బుక్కరాయసముద్రం మండల పరిధిలోనే దాదాపు దాదాపు 70 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రెడ్డిపల్లి గ్రామం పరిధిలో భారీ వృక్షాలు సైతం నేలకూలాయంటే గాలుల తీవ్రతని ఎలా ఉందో అంచనావేయొచ్చు. ఇటు అసని తుఫాన్‌ ఉప్పు రైతులను కూడా దెబ్బతీసింది. ఏడాదిలో అరు నెలలు మాత్రమే ఉప్పు పండిస్తారు ఉప్పురైతులు. మేనెలలో ఎండలు అధికంగా ఉండడంతో ఉప్పు తయారీకి అనువైన అది అనువైన కాలం. అలాంటి సమయంలో ముంచుకొచ్చిన తుఫాన్‌ ఉప్పు రైతులను నడిసంద్రంలో ముంచేసింది. అసని తుఫాను దెబ్బకు ఉప్పు కల్లాలు నీటిలో మునిగిపోయాయి. ఉప్పు నీటిలో కరిగిపోయింది. మరోసారి పంట రావాలంటే పది నుంచి 20 రోజులు పడుతుంది. ఇక ముందు ముందు రుతుపవనాలు ఆ పంట కూడా పండే పరిస్థితి లేదు.

Hyderabad News: కొడుకు కోసం పోరాటం..రెండు నెలల పసిగుడ్డును వదిలించుకున్న తల్లి, 14ఏళ్లుగా పెంచిన అమ్మ..

RTC Driver Suicide: రిటైర్‌మెంట్‌కు దగ్గరపడ్డ ఆర్టీసీ డ్రైవర్‌..బస్సుకింద పడి ఆత్మహత్య! కుటుంబ సభ్యుల ఆరోపణ ఇలా..