
తిరుమల వెంకన్న భక్తులు బి అలర్ట్ అంటోంది టీటీడీ. నకిలీ వెబ్‌సైట్ల తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది.
అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్స్ చేయాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అప్రమత్తమై ఈ మేరకు భక్తులను అలెర్ట్ చేస్తోంది. కేరళకు చెందిన సికె సురేష్ బాబు అనే భక్తుడు తిరుమలలో కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో గదులు ఏర్పాటు చేస్తామన్న వ్యక్తి చేత మోసపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది.
విచారణలో తిరుమల శ్రీవారి ఆలయ చిత్రాలు, టీటీడీ పేరును అనధికారికంగా వినియోగిస్తూ నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి భక్తులను తప్పుదారి పట్టిస్తున్నట్టు గుర్తించారు. గూగుల్ సెర్చ్‌లలో ఈ ఫేక్ వెబ్‌సైట్లు కనిపిస్తూ, భక్తుల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తేలింది. ఈ మేరకు నకిలీ వెబ్‌సైట్లపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు టీటీడీ ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీటీడీ చిహ్నాలు, ఆలయ చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేసింది. శ్రీవారి భక్తులు
దర్శనం, వసతి గదులు, సేవా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే మాత్రమే బుకింగ్ చేసుకోవాలని టిటిడి భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. భక్తులు మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. అనుమానాస్పద వెబ్‌సైట్లు, ఫోన్ కాల్స్‌ను వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తుంది.