తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి ప్రత్యేక దర్శనం కోసం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రూ.300 టికెట్లను విడుదల చేయనున్నారు. వీటిని https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. జులై 24న ఉదయం 11.00 AM గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోజనులకు, వికలాంగులకు చెందిన కోటా టికెట్లను విడుదల చేస్తారు. జులై 25న ఉదయం 10.00 AM గంటలకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి అదనపు కోటా కింద టికెట్లను విడుదల చేయనున్నారు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు 4000 టికెట్లు అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి దాదాపు 15 వేల టికెట్లు విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జులై 26న మైసూరు మహారాజ జన్మదినం సందర్భంగా.. ఉత్తరభద్ర నక్షత్రను పురస్కరించుకుని తిరుమలలో పల్లవోత్సవం నిర్వహించనున్నారు. ఈ పల్లకోత్సవంలో శ్రీమాలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి దేవతలను ఊరేగించనున్నారు. కర్ణాటక ప్రభుత్వం తరుపున ప్రతినిధులు దేవతలను ఆహ్వానించి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టగా.. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పట్టనుంది.