AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్.. అసలు ఎలా బయటపడిందంటే..?

ఆ పట్టు వస్త్రాన్ని ముట్టుకుంటేనే మహా పుణ్యమని భావిస్తారు.. మెడలో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేనని పులకించిపోతారు.. జీవితంలో ఒక్కసారైనా దానిని కప్పుకోవాలని తహతహలాడతారు. అంతటి పవిత్రత ఉన్న వెంకన్న స్వామి పట్టు వస్త్రంలో పట్టులేదని.. పాలిస్టర్‌ మాత్రమే ఉందన్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాలనే అవాక్కయ్యేలా చేస్తోంది. అసలు ఈ స్కామ్ ఎప్పటినుంచి జరుగుతుంది. ఎలా బయటపడింది అనేది తెలుసుకుందాం..

Tirumala: తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్.. అసలు ఎలా బయటపడిందంటే..?
Ttd Silk Scam
Raju M P R
| Edited By: |

Updated on: Dec 11, 2025 | 9:02 AM

Share

తిరుమల క్షేత్రం.. భక్తిభావానికి, పవిత్రతకు నిలువుటద్దం.. అక్కడ పీల్చే గాలి కూడా శ్రీవారి ఆశీర్వాదమేనని భావిస్తుంటారు భక్తజనం. అలాంటి కలియుగ వైకుంఠంలో వెలుగులోకొస్తున్న వరుస స్కామ్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నామధ్య కల్తీ నెయ్యి కలకలం… నిన్నటికి నిన్న పరకామణి చోరీ వ్యవహారం.. ఇప్పుడేమో పట్టువస్త్రం పేరుతో కుంభకోణం.. ఇలా కొండచుట్టూ స్కామ్‌లు జరుగుతుండటం కలవరపెడుతోంది. స్వామివారి పట్టు వస్త్రాల కొనుగోళ్లలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని టీటీడీ ఓ అంచనాకొచ్చింది. పట్టు వస్త్రాలతో పాటు.. దాతలు, VIPలకు బహుకరించే పట్టు శాలువాల కొనుగోళ్లలో అవినీతే జరుగుతోందని చెబుతోంది. పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలను అంటగడుతూ.. సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు 2010 నుంచి ఈ దందా చేస్తున్నారని ఆరోపించింది. అసలది పట్టే కాదు అంతా వట్టిదేనన్న అంశం రెండు నెలల క్రితం జరిగిన బోర్డు మీటింగ్‌లోనే చర్చకొచ్చిందని.. ఓ క్లారిటీ వచ్చాకే బయటపెట్టాలనుకున్నామని తెలిపింది. 350-400 రూపాయల విలువచేసే ఒక్కో పట్టు శాలువాని 14 వందల రూపాయలకు అమ్ముతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఇప్పటిదాకా 54 కోట్ల అవినీతి జరిగిందని చెబుతుంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును ఏసీబీకి అప్పగించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.

గత సెప్టెంబర్‌లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కొనుగోలు చేసిన వస్త్రాలే ఈ స్కామ్ బయటకు రావడానికి కారణం. బీఆర్ నాయుడు టీటీడీకి వస్త్రాలు సరఫరా చేస్తున్న ఏజెన్సీ ద్వారానే తన అవసరం మేరకు కొనుగోలు చేశారు. ఒక్కో వస్త్రాన్ని రూ. 350 లకు కొన్నారు. దీంతో నాణ్యత పై అనుమానం రావడంతో సెప్టెంబర్ 16న జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి.. నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌ను ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు తిరుమలలోని వైభవోత్సవ మండపం, తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం నుంచి ఒక్కోచోట రెండేసి వస్త్రాల శాంపిల్స్‌ను సేకరించారు. ఈ శాంపిల్స్‌ను ధర్మవరం మరియు బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు నాణ్యత పరీక్షల కోసం పంపారు. సెంట్రల్ సిల్క్ బోర్డు ఇచ్చిన శాంపిల్స్ రిపోర్ట్ టీటీడీ నిబంధనలు తీవ్రంగా అతిక్రమించినట్లు తేల్చింది.

టెండర్‌ నియమాల ప్రకారం… వస్త్రాలను స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నేయాలి. కనీసం 31.5 డెనియర్ నూలును ఉపయోగించాలి. ప్రతి శాలువాపై ఒకవైపు సంస్కృతంలో, మరోవైపు తెలుగులో ఓం నమో వేంకటేశాయ అని.. శంకుచక్రం, నామం చిహ్నాలు ఉండాలి. ఇక శాలువా పరిమాణం, బరువు, బార్డర్ రూపకల్పనను కూడా టెండర్‌లో స్పెషల్‌గా మెన్షన్‌ చేస్తారు. ఇప్పుడీ నిబంధనలనే VRS ఎక్స్‌పోర్ట్స్ సంస్థ గాలికొదిలేసిందని టీటీడీ ప్రధాన ఆరోపణ. పట్టుకు బదులు పూర్తి పాలిస్టర్‌తో వస్త్రాలను తయారు చేసి.. టీటీడీనే కాదు భక్తులనూ మోసం చేస్తున్నారని బోర్డు మెంబర్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి 2025 వరకు దాదాపు రూ. 54.95 కోట్ల విలువైన వస్త్రాలను పంపిణీ చేసిన నగరి సమీపంలోని VRS ఎక్స్పోర్ట్స్, దాని అనుబంధ సంస్థలైన తిరుమల ఫ్యాబ్రిక్స్, వీఎం రాజా పవర్ లూమ్ యూనిట్లపై బోర్డు చర్యలు తీసుకుంది. తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం నుంచి సేకరించిన శాంపిల్ వస్త్రాలకు కాంచీపురం సెంట్రల్ సిల్క్ బోర్డు అప్రూవల్ ఇవ్వడంపై కూడా టీటీడీ విజిలెన్స్‌కు అనుమానం వచ్చింది. ల్యాబ్‌లో అవకతవకలు జరిగి ఉంటాయన్న అనుమానంతో దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

ఇటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఇష్యూపై సీరియస్‌గానే స్పందించారు. టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆ అక్రమాలపై విచారించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించడంతోనే… వరుస స్కామ్‌లు బయటకొస్తున్నాయన్నారు. వాస్తవాలు బయటకొచ్చాక చట్టపరంగా ముందుకెళ్తామన్నారు పవన్. ప్రస్తుతం టీటీడీ వద్ద 15 రోజులకు సరిపడా వస్త్రాలు అందుబాటులో ఉన్నందున, భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న వస్త్రాలనే వేదాశీర్వచనంలో వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ అవినీతిపై పూర్తిస్థాయి విచారణ మరింత మంది అధికారుల పాత్రను బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..