తిరుపతి, జులై 28: తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఎల్లవేళలా రద్దీగా ఉండే తిరుమల గిరిలో అప్పుడప్పుడూ అడవి మృగాలు దాడి చేస్తునే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు పులులు భక్తులను హడలెత్తించాయి. ఇప్పుడేమో ఏకంగా పాములు దాడి చేస్తున్నాయి. తాజాగా తిరుమల నడక మార్గంలో వెళ్తున్న ఓ భక్తుడిని పాము కాటేసిన ఘటన కలకలం సృష్టించింది. అసలేం జరిగిందంటే..
తిరుమల శ్రీవారి దర్శనానికి నడక మార్గంలో వెళ్తున్న ఓ భక్తుడిని శనివారం పాము కాటేసింది. చీరాలకు చెందిన కొంతమంది భక్తులు అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏడో మైలు వద్దకు రాగానే సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి మెట్లపైకి చేరుకున్న పాము, మెట్లపై విశ్రాంతి తీసుకుంటున్న నాగేంద్ర అనే భక్తుడిని కాటేసింది. దీంతో శ్రీవారి భక్తులంతా ఒక్కసారిగా భయంతో హాహాకారాలు చేశారు. భక్తుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న టీటీడీ, అటవీ సిబ్బంది పాము కాటుకు గురైన యువకుడిని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడే యువకుడు చికిత్స పొందుతున్నారు. యువకుడిని కాటేసిన పాము విషపూరితమైనది కాకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అతని ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని వైద్యులు తెలిపారు.
A pilgrim was bitten by a snake on the Alipiri footpath at the 7th mile yesterday. Forest department officials hurried to the spot and transferred the affected pilgrim to the TTD hospital. pic.twitter.com/3OT16f2nGy
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) July 28, 2024
తిరుపతిలోని కలియుగ వైకుంఠం తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనానికి కొందరు కారులు, బైకులు వంటి సొంత వాహనాల్లో కొండపైకి చేరుకుంటూ ఉంటారు. మరికొందరేమో ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటారు. అయితే అనేక మంది భక్తులు మాత్రం నడక మార్గంలో శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. వీరిలో కొంత మంది అలిపిరి నడక మార్గాన్ని ఎంచుకుంటే.. మరికొంత మందేమో శ్రీవారి మెట్టు గుండా కొండపైకి వస్తుంటారు. అది అటవీ ప్రాంతం కావడంతో భక్తులు వెళ్లే నడకమార్గంలో వన్యప్రాణులు సంచరిస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు చిరుతలు, ఎలుగుబంట్లు నడకదారిలో భక్తులపై దాడి చేసాయి కూడా. గతేడాది లక్షిత అనే చిన్నారిపై చిరుతపులి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారితీసింది. భక్తుల భద్రత కోసం అప్పట్లో టీటీడీ భక్తులకు చేతి కర్రలు కూడా పంపిణీ చేసింది.