టిటిడి అనధికార వెబ్ సైట్లపై కొరడా ఝుళిపిస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తుల నుంచి వరుసగా నకిలీ టికెట్లు పట్టుబడుతుండటంతో టీటీడీ అప్రమత్తమయింది. టిటిడి అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని సూచించింది. https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్ లైన్లో ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరుతోంది. దళారులను ఆశ్రయించి దర్శన టికెట్లు పొంది నష్ట పోవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఫేక్ టికెట్స్ బయటపడుతుండటంతో టిటిడి భక్తులను అప్రమత్తం చేస్తోంది. ఇందులో భాగంగానే తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు ఆగస్టు 22న ఉదయం కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో ఎంట్రీ ఇచ్చారు. వారిని టిటిడి విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి నకిలీ టికెట్లతో వచ్చిన మురళీధరన్, తెన్నేజీ, మురుగేష్, రాణి అనే భక్తులను టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆన్లైన్ ద్వారా కళ్యాణోత్సవం టికెట్లను పొందామని చెప్పిన భక్తులు పాస్ పోర్టు నంబర్ల ఆధారంగా టికెట్లను బుక్ చేసినట్లు గుర్తించారు.
టికెట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించడంతో మార్ఫింగ్ చేసినట్లు తేలింది. తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురై పాస్ పోర్ట్‌లోని చివరి నెంబర్లు మార్చి ఆన్ లైన్లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి అధిక ధరలకు విక్రయించినట్లు తేలింది. ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమంది దళారులు దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తులను మోసం చేస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. అంతేకాకుండా అమాయక భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని చెబుతోంది.
ఇందులో భాగంగానే టిటిడి యాజమాన్యం దళారుల ఏరివేతపై మరింత ఫోకస్ పెట్టింది. దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దని సూచిస్తోంది. భక్తులు పొందిన టికెట్లను, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చెక్ చేస్తోందని, టికెట్లు నకిలీవని తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సివస్తుందని హెచ్చరిస్తోంది. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తప్పవని టీటీడీ మరోసారి హెచ్చరిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..