జస్ట్ 20 నిమిషాలే.. ఆ రూట్‌లో ప్రయాణం మరింత సులభం.. ఇక దూసుకెళ్లడమే
అమరావతికి వచ్చే విఐపిల రాకపోకలను మరింత సులభం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూట్‌ను సిద్ధం చేస్తోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా వెస్ట్ బైపాస్ ద్వారా రాజధానిలోకి చేరుకునేలా ప్రత్యేక మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నగర ట్రాఫిక్‌కు దూరంగా ఉండే ఈ మార్గం ద్వారా ప్రయాణం వేగవంతం కావడంతో పాటు భద్రతా పరంగా కూడా అనుకూలంగా ఉండనుంది.

ప్రస్తుతం విజయవాడ నగరం గుండా కరకట్ట రహదారి మీదుగా అమరావతికి వెళ్లే మార్గంలో తీవ్ర రద్దీ ఉంటుంది. ముఖ్యంగా వీఐపీలు విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత ఈ ట్రాఫిక్ వల్ల ఆలస్యం ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వెస్ట్ బైపాస్‌ను ప్రధాన ప్రవేశ మార్గంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 49 కిలోమీటర్ల పొడవున్న ఈ బైపాస్‌లో కృష్ణా నదిపై నిర్మించిన భారీ వంతెన ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆరు నుంచి ఎనిమిది లేన్లతో నిర్మితమైన ఈ వంతెన ద్వారా రాజధానిలోకి ప్రవేశించడం సులభం అవుతుంది.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ మార్గంలో ప్రయాణించి పనుల పురోగతిని పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ హైవే అందుబాటులో ఉండటం వల్ల వీఐపీలు త్వరగా ఎయిర్‌పోర్టు, అమరావతి మధ్య రాకపోకలు సాగిస్తారు. ఈ మార్గం కొత్తగా వచ్చే అతిథులకు అమరావతిని ఆకర్షణీయంగా పరిచయం చేసేలా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రహదారి అత్యాధినిక హంగులతో తీర్చి దిద్దుతోంది.
ఇప్పటికే చిన్నవట్టుపల్లి నుంచి వెంకటపాలెం వరకు రహదారి పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన డ్రైనేజీ వంటి కీలక పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, అమరావతికి ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది.
త్వరలోనే ఈ రహదారిని అధికారికంగా వీఐపీ రూట్‌గా ప్రకటించే అవకాశం ఉంది. అమరావతి రాజమార్గంగా దీనికి గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆధునిక సదుపాయాలతో రూపొందుతున్న ఈ మార్గం రాజధాని ప్రతిష్టను మరింత పెంచేలా ఉండనుంది. భవిష్యత్తులో విదేశీ ప్రతినిధులు, ప్రముఖులకు ఈ రహదారి గొప్ప స్వాగతం పలకనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
