Tomato price today: ఊరించి, ఉసూరుమనిపించి.. తుస్సుమన్న టమాట ధర.. కేజీ 30 రూపాయలే..

టమాటా బాంబ్‌ అప్పుడే తుస్‌ మంది. ధరలతో మంట రేపిన బుల్లి టపాకాయ్‌.. నేలచూపు చూస్తోంది. ఢిల్లీ వంటి నగరాల్లో 250 పలికిన ధర.. ఇప్పుడు ఏకంగా 30 రూపాయలకు పడిపోయింది.

Tomato price today: ఊరించి, ఉసూరుమనిపించి..  తుస్సుమన్న టమాట ధర.. కేజీ 30 రూపాయలే..
Tomato Prices
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 6:00 PM

ఎన్నడూ లేని విధంగా టమాటా ధరలు రికార్డు సృష్టించాయి. నాన్‌వేజ్‌ని బీట్‌ చేశాయి. చికెన్‌ రేట్‌ కంటే ఎక్కువ ధర పలికింది. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఈ ధరలు కొంత ఊరటనిచ్చాయి. ఉన్న పంటకైనా మంచి రేటు వస్తుందన్న సంతోషంతో ఉండిపోయారు. ఏమయిందో..ఏమో కాని.. డమాల్‌ మంటూ స్టాక్‌ మార్కెట్‌ లెవల్‌లో పడిపోయింది. నేలచూపులు చూస్తోంది. ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. ప్రతి ఏటా వేసవిలో గాని.. జూన్‌, జులై నెలలో గాని టమాటా రేట్లు రికార్డు స్థాయిలో నమోదవుతాయి. అలాంటిది.. ఈ ఏడాది మాత్రం అకస్మాత్తుగా వచ్చిన వరదలతో టమాటా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. ఈ పరిణామాలు వినియోగదారులకు శాపంగా మారితే.. ఎప్పుడూ ఇంత రేటు రాని రైతులు మాత్రం సంతోషపడ్డారు. మరి కొంత కాలం ఇలాంటి ధరలు ఉండాలని ఆశించారు. అయితే.. ఉన్నట్టుండి స్టాక్‌ మార్కెట్‌ మాదిరిగా ఒక్క సారిగా ధరలు పడిపోయాయి. ఎంతలా అంటే.. కనీస స్థాయికి చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టమాటా పంట ఎక్కువగా పండే.. చిత్తూరు, కడప, కర్నూలులో ధరలు అమాంతం పడి పోయాయి. వారం క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లిలో 130 రూపాయలు పలికిన కిలో టమాటా..ప్రస్తుతం 30 నుంచి 35 రూపాయలకు పడిపోయింది.

ఇంత కాలం ఇతర ప్రాంతాలకు టమాటాను ఎగుమతి చేసే చిత్తూరు జిల్లాకు.. ఈ సంక్షోభంలో ఇతర రాష్ట్రాల నుంచి పంట పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి మదనపల్లి, ములకల చెరువు మార్కెట్‌కు దిగుమతి అవుతోంది. ఈ పరిణామాలతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. అటు.. కర్నూలు జిల్లా మార్కెట్‌లో కూడా కనీస స్థాయికి చేరుకున్నాయి. ఆస్పరి కూరగాయల మార్కెట్‌లో టమాటా ధరలు తగ్గిపోయాయి. 25 కిలోల టమాటా బాక్స్‌ 750 రూపాయలకు పడిపోయింది. కిలో 30 రూపాయలు హోల్‌ సెల్‌ అమ్ముడు పోతోంది. రెండు రోజుల క్రితం మాత్రం కిలో 150 రూపాయలకు అమ్మారు. టమాటా ధరలు తగ్గినా.. మిగతా కూరగాయల రేట్లు మాత్రం భగ్గు మంటున్నాయి. బీరకాయ, వంకాయ, గోచిక్కుడు ధరలు భారీగా పెరిగి పోయాయి. బీరకాయ కిలో 70, వంకాయ కిలో 60, గోకరకాయ కిలో 50 రూపాయలు పలుకుతోంది. అయితే.. టమాటా ధర తగ్గడం వినియోగ దారులకు గుడ్‌న్యూస్‌ అయినా.. పంట పండించే రైతులకు మాత్రం చేదు వార్తే. తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్‌కు తగ్గ పంట లేకపోవడంతో పక్క రాష్ట్రాల నుంచి తెప్పించి వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు.

Also Read: AP Weather: ఏపీకి వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Telangana: కాటేసిన పాము.. పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ