Tomato Price: డబుల్ సెంచరీకి చేరువలో టమోటా.. ప్రస్తుతం ధర ఎంత ఉందో తెలుసా..!

Tomato Price: ఊహించని రీతిలో రికార్డు ధర లభించడంతో మార్కెట్ కు తీసుకెళ్లిన టమోటా కు లభిస్తున్న ధరను చూసి రైతే నమ్మలేని పరిస్థితి నెలకొంటోంది. ఆశించిన మేర దిగుబడి లేకపోయినా ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ మదనపల్లి వ్యవసాయ మార్కెట్ లో టమోటాను పోటీపడి కొంటున్న బయ్యర్లు ట్రేడర్లు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతంలో దాదాపు 12 వేల హెక్టార్లలో టమోటా సాగు అవుతుండగా సమ్మర్ సీజన్ లోనే..

Tomato Price: డబుల్ సెంచరీకి చేరువలో టమోటా.. ప్రస్తుతం ధర ఎంత ఉందో తెలుసా..!
Tomato
Follow us
Raju M P R

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 30, 2023 | 6:12 AM

Tomato Price: టమోటా. ఒకప్పుడు నష్టాల పంట. అయితే ఇప్పుడిది కాసులపంట. ఏకంగా కిలో టమోటా ధర డబుల్ సెంచరీకి చేరువ కావడంతో టమోటా సాగు చేసిన రైతుకు డబుల్ ధమాకా గా మారింది. ఊహకందని ధర చిత్తూరు జిల్లాలో టమోటాను సాగు చేసిన రైతుల్లో కొందర్ని ఒక్కసారిగా కోటీశ్వరుల్ని చేసింది.

నిన్నటి దాకా రూ. 168 ఈ రోజు ఏకంగా రూ. 196..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో ప్రధాన ఏటా సాగయే పంటల్లో టమోటా ఒకటి. ఏటా నష్టాలను చవిచూస్తున్న రైతు టమోటా సాగును మాత్రం మర్చిపోకుండా అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. అయితే ఈ ఏడాది టమోటా సాగుచేసిన రైతు ను అదృష్ట దేవత అష్టలక్ష్మిలా ఇంటికి చేరింది. ఊహించని రీతిలో రికార్డు ధర లభించడంతో మార్కెట్ కు తీసుకెళ్లిన టమోటా కు లభిస్తున్న ధరను చూసి రైతే నమ్మలేని పరిస్థితి నెలకొంటోంది. ఆశించిన మేర దిగుబడి లేకపోయినా ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ మదనపల్లి వ్యవసాయ మార్కెట్ లో టమోటాను పోటీపడి కొంటున్న బయ్యర్లు ట్రేడర్లు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతంలో దాదాపు 12 వేల హెక్టార్లలో టమోటా సాగు అవుతుండగా సమ్మర్ సీజన్ లోనే టమోటాకు గిరాకీ ఉంటుంది. అయితే ఇంతగా ధర ఎప్పుడు ఉండే పరిస్థితి లేదు.

దేశంలో ఇతర ప్రాంతాల్లో వివిధ కారణాలతో టమోటా దిగుబడి లేకపోవడం, బయ్యర్లంతా మదనపల్లి మార్కెట్ వైపే చూడడంతో చిత్తూరు జిల్లా టమోటా రైతు పంట పండింది. నిన్న మొన్నటిదాకా రికార్డు స్థాయి కిలో టమోటా ధర రూ. 168లే అత్యధిక ధర అనుకుంటే ఈ రోజు ఏకంగా ఏ గ్రేడ్ కిలో ధర రూ. 196 ధర పలికింది. అయితే కేవలం 253 మెట్రిక్ టన్నుల టమోటా మాత్రమే మదనపల్లి మార్కెట్ కు రావడంతో బయ్యర్ల మద్య పోటీ టమోటా రేట్ కు గిరాకి పెంచింది. బయట ప్రాంతాల్లో టమోటా లేకపోవడం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న బయ్యర్ల మద్య పోటీనే మదనపల్లి మార్కెట్ లో టమోటా కు డిమాండ్ కారణమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడు తున్నాయి. మరోవైపు సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు కావడంతోనే దిగుబడి తగ్గిందని ధరలు పెరుగుదలకు ఇదో కారణమన్న అభిప్రాయం కూడా అధికారుల నుంచి వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి

టమోటా కాసుల పంటగా రైతును కోటీశ్వరున్ని చేసింది..

ఇక కాసుల పంట పండిస్తున్న టమోటా ఏడాది కొద్దిమంది రైతులను కోటీశ్వరులను చేసింది. అధిక ఉష్ణోగ్రతలతో సాగు విస్తీర్ణం తగ్గిన దిగుబడి ఆశించిన మేర లేక పోయినా ఎర్రని టమోటా ధర అందనంత ఎత్తుకు చేరుకోవడంతో రైతులకు అప్పుల బాధలు తీరిపోయాయి. టమోటా సాగు తీసిన రైతు ప్రతి ఏటా గిట్టుబాటు ధర లభించక మదనపల్లి మార్కెట్ లోనే టమోటాలు నేలపాలు చేసి తిరిగి వెళ్ళిపోయే రైతు ఈసారి సాగు చేసిన పొలంలో ఒక్క టమోటా కూడా నేర రాలకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. కంటికి రెప్పలా సాగుచేసిన టమోటా పైరును కాపలాకాస్తున్న పరిస్థితి దాపురించింది. పొలంలోని టమోటా చోరీకి గురికాకుండా రాత్రింబవళ్లు పొలంలోనే నిద్రాహారాలు మాని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా టమోటాను మార్కెట్ కు చేర్చుతున్న రైతులు అంతకంతకు పైకి ఎగబాకుతున్న ధరతో జేబులు నింపుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇలా టమోటా సాగుచేసిన రైతులు కోటీశ్వరులుగా లక్షాధికారులుగా పడమటి మండలాల్లో ఒక్కరోజులోనే అయిపోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. నిన్న మొన్నటి వరకు వ్యవసాయంలో అప్పులని చూసిన ఒకరిద్దరు రైతుల్లో పుంగనూరు మండలం కుదవూరుకు చెందిన రెడ్డెప్ప అనే రైతు ఒకరు. గతంలో 4 ఎకరాల్లో టమోటా సాగు చేసి అప్పులు అయ్యాడు. ప్రస్తుతం 2 ఎకరాల్లో పంట సాగు చేసిన రెడ్డప్ప.. ఇప్పటికే సుమారు రూ. 40లక్షలను చూసాడు. ఇక అదే గ్రామానికి చెందిన వెంకటరమణ యాదవ్ అనే రైతు 2 ఎకరాల్లో టమోటా పంట సాగు చేసి ఇప్పటికే రూ.18 లక్షలను చూసాడు. ఇక మదనపల్లి మండలం వేంపల్లి గ్రామానికి చెందిన రైతు 2 ఎకరాలు సాగు చేసి రూ. 20లక్షల ఆదాయం పొందాడు.

సోమల మండలం కరకమంద కు చెందిన రైతు చంద్రమౌళి టమోటా సాగు చేసి జాక్ పాట్ కొట్టాడు. సువ్వారపువారి పల్లె లో పొలాన్ని కౌలుకు తీసుకొని టమోటా సాగుచేసిన చంద్రమౌళి మేలురకం వంగడాలు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో మంచి రేటు రావడంతో 10 ఎకరాల్లో టమోటా సాగు చేసి ఏకంగా రూ.4 కోట్ల వరకు ఆదాయం పొందాడు. రూ. 70లక్షల దాకా పెట్టుబడి పెట్టిన రైతుకు టమోటా కాసులు పంట పండించగా మరోవైపు టమోటా ధర తగ్గేదెలా అన్నట్టు అంతకంతకు పెరుగుతూనే ఉంది. మరికొన్ని రోజులు ఇదే ధర ఇలాగే కొనసాగుతూ ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడు తుండటంతో ఏకంగా డబుల్ సెంచరీకి కిలో టమోటా ధర చేరుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారుడు కొనలేని పరిస్థితి నెలకొంటుంది. సామాన్యుడి ఇంటి భోజనంలో తాను ఒక భాగమై కనిపించే టమోటా ఇప్పుడు వంటింటికే దూరమైన పరిస్థితి దాపురించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..