తిరుపతిలోని శ్రీవారి దర్శనం కోసం కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శన టోకెన్ల జారీ శుక్రవారం ప్రారంభమైంది. తెల్లవారుజామున మూడు గంటలకు 8వేల దివ్య దర్శన టోకెన్లు టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు అవి పూర్తి కాగా మిగిలిన భక్తులకు మరో 4వేల టోకెన్లు విడతల వారీగా జారీ చేశారు. అయితే ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు.. గాలిగోపురం వద్ద ఉన్న కౌంటర్‌లో స్కానింగ్ చేసుకోవాలి.
మరోవైపు ఈరోజు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో దాదాపు 65 అంశాలపై పాలక మండలి చర్చించనుంది. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై, శ్రీవాణి, టూరిజం, వీఐపీ బ్రేక్ దర్శనాల తగ్గింపుపై బోర్డు సభ్యులు చర్చించనున్నట్లు సమాచారం. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మిస్తున్న ఆలయాలపై సమీక్షించనున్న టీటీడీ బోర్డు.. స్థానిక సభ్యులతో కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..