Tirumala: కురులతో సిరులు.. వడ్డీకాసులవాడికి కాసుల వర్షం.. ఈ ఏడాది ఎంత వచ్చిందో తెల్సా..?

వడ్డీకాసులవాడికి కాసుల వర్షం కురుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తకోటి విరాళాలతో.. అత్యంత సంపన్న దేవుడుగా వెంకన్న విరాజిల్లుతున్నాడు. కురులతో సిరులు కురుస్తున్నాయి. తాజాగా.. ఈ వేలంలో దాదాపు 48 కోట్ల ఆదాయం సమకూరింది.

Tirumala: కురులతో సిరులు.. వడ్డీకాసులవాడికి కాసుల వర్షం.. ఈ ఏడాది ఎంత వచ్చిందో తెల్సా..?
Tirupati Balaji temple Human Hair Income
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 25, 2022 | 8:21 PM

కలియుగ ప్రత్యక్షదైవంగా వెంకటేశ్వరస్వామిని కొలుస్తారు భక్తులు. దేవ దేవుని లిప్తపాటు దర్శనం కోసం.. నిత్యం భక్త కోటి తరలివచ్చి తరిస్తారు. గోవింద నామ స్మరణతో.. కాలినడకన ఏడు కోండలు ఎక్కి.. స్వామివారిని దర్శించుకుంటే.. కోటిజన్మల పుణ్యఫలమని భావిస్తారు. అందుకే.. తిరుమలకు రోజూ.. వేలల్లో, లక్షల్లో భక్తులు వస్తారు. కోరిన కోరికలు తీరడంతో.. కానుకల రూపంలో మొక్కులు తీర్చుకుంటారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తకోటి విరాళాలతో.. అత్యంత సంపన్న దేవుడుగా వెంకన్న విరాజిల్లుతున్నాడు.

కోరిన కోరికలు తీర్చే తిరుమల కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తలనీలాల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. దేశంలో అన్ని ఆలయాల కంటే… తిరుమలలోని ఏడుకొండస్వామి చెంత భక్తులు అధిక సంఖ్యలో తలనీలాలు సమర్పించుకుంటారు. ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునేవారిలో 30శాతం మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు. ఇలా భక్తుల సమర్పించుకున్న తలనీలాలను టీటీడీ ప్రతి యేట ఆన్‌లైన్‌లో వేలం వేస్తుంది. ఈ-వేలం సైట్‌లో టీటీడీ వివిధ రకాల సైజుల్లోని తలనీలాలకు వేలం నిర్వహించగా.. పాటదారులు 21,100 కేజీలకు బిడ్‌ చేశారు. ఇలా వేలం వేసిన తలనీలాల ద్వారా టీటీడీకి ఈ యేడాది మొత్తం రూ.47.92 కోట్ల ఆదాయం వచ్చింది..

తిరుమలలో త‌ల‌నీలాల స‌మ‌ర్పించ‌డాన్ని.. భక్తులు అత్యంత ప‌విత్రంగా భావిస్తారు. త‌ల‌నీలాల స‌మ‌ర్పణ ద్వారా… స్వామివారి నిండైన దీవెన‌ల‌ను అందుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా తిరుమ‌ల‌లోని ప్రధాన కల్యాణకట్టతోపాటు.. మినీ కల్యాణకట్టల్లో యాత్రికులు ఉచితంగా త‌ల‌నీలాలు స‌మ‌ర్పించేలా… టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. అంతేగాక యాత్రికులు భ‌క్తితో స‌మ‌ర్పించిన త‌ల‌నీలాల‌ను… టీటీడీ ప్రత్యేకశ్రద్ధతో సేకరించి నిల్వ చేస్తుంది. త‌ల‌నీలాల విక్రయం ద్వారా… సంవత్సరానికి రూ.120 కోట్ల వ‌ర‌కు ఆదాయం స‌మ‌కూరుతోంది.

యాత్రికులు స‌మ‌ర్పించిన త‌ల‌నీలాల‌ను ముందుగా.. హుండీల్లో వేస్తారు. వివిధ సైజుల్లో ఉన్న ముడులు, 5 అంగుళాల కంటే త‌క్కువ ఉన్న తుక్కును వేరువేరుగా సేక‌రిస్తారు. తిరుమ‌ల నుంచి ప్రతిరోజూ సాయంత్రం టిటిడి వాహ‌నంలో భద్రత న‌డుమ.. తిరుప‌తిలోని హ‌రేరామ ఆల‌యం రోడ్డులో గ‌ల గోడౌన్‌కు త‌ర‌లిస్తారు. ముడులు, తుక్కు క‌లిపి రోజుకు 700 నుండి 900 కిలోల త‌ల‌నీలాలు గోడౌన్‌కు చేరుతుంటాయి.

అంత‌ర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టిటిడి నిర్దేశించిన సైజుల వారీగా విభ‌జిస్తారు. మొదటి రకం 27 ఇంచుల పైన, రెండో రకం 19 నుంచి 26 ఇంచులు, మూడో రకం 10 నుంచి 18 ఇంచులు, నాలుగో రకం 5 నుంచి 9 ఇంచులు, ఐదో రకం 5 ఇంచుల కన్నా తక్కువ… త‌ల‌నీలాలు ఉంటాయి. మొద‌టి ర‌కం, రెండో ర‌కం త‌ల‌నీలాల‌ను 20 కిలోల సంచుల్లో, 3, 4, 5 ర‌కాల త‌ల‌నీలాల‌ను 30 కిలోల సంచుల్లో నిల్వ చేస్తారు.

తిరుమల నుంచి సేకరించిన మహిళల శిరోజాలకు.. అంతర్జాతీయంగా.. అత్యధిక డిమాండ్ ఉంది. వీటిని నల్ల బంగారంగా పిలుస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా విగ్గులకు భారీ డిమాండ్ ఉంది. అలానే.. బార్బీ బొమ్మల జట్టుకు సైతం.. నేచురల్‌ వెంట్రుకలను ఉపయోగిస్తున్నారు. ఇలా.. ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల శిరోజాలకు అత్యధిక డిమాండ్ ఉంది.. 2021లో భారత్ కనీసం రూ.6300 కోట్ల విలువైన శిరోజాలను ఎగుమతిచేసి టాప్ లో ఉంది

మరోవైపు.. రోజురోజుకు పెరుగుతున్న భక్తకోటి విరాళాలతో.. అత్యంత సంపన్న దేవుడుగా వెంకన్న విరాజిల్లుతున్నాడు. గతేడాది కరోనా కారణంగా పూర్తిగా పడిపోయిన హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఒక్కసారిగా భక్తకోటి పోటెత్తడంతో.. రికార్డు స్థాయిలో శ్రీవారి సంపద పెరుగుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..