Tirumala: ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం.. టీటీడీ సంచలన నిర్ణయం

|

Feb 17, 2022 | 5:46 PM

Tirumala Temple: సర్వదర్వనాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని నిర్ణయించింది టీటీటీ. కరోనాకు ముందున్న పరిస్థితిని తిరుమలలో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు టీడీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి.

Tirumala: ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం.. టీటీడీ సంచలన నిర్ణయం
Tirumala News
Follow us on

Tirumala Tirupati: టీటీడీ(Ttd) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తిరుమలలో భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలని నిర్ణయించింది. ప్రైవేటు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తొలగించి, భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకోనుంది. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం అందించేందుకు బోర్డు నిర్ణయించిందని తెలిపారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి(Y V Subba Reddy). తిరుమలలో భోజనాన్ని భక్తులు డబ్బుతో కొనుగోలు చేయొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నిర్ణయం ఒక్కటే కాదు. త్వరలోనే సర్వదర్వనాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. కరోనా(Coronavirus)కు ముందున్న పరిస్థితిని తిరుమలలో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు టీడీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి. 2022-2023 వార్షిక బడ్జెట్‌ను 3096 కోట్ల రూపాయలతో బోర్డు ఆమోదం తెలిపింది. అన్నమయ్య నడక మార్గాన్ని భక్తులు నడిచేందుకు అనువుగా మర్చాలని నిర్ణయించింది. తిరుపతిలో పద్మావతి చిన్ని పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 230 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే చిన్ని పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి.

తిరుమలలో సిఫార్సు లేఖలను తగ్గించేందుకే ఆర్జిత సేవల ధరల పెంచాలని నిర్ణయించామన్నారు సుబ్బారెడ్డి. సామాన్య భక్తుల దర్శనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరలను పెంచబోమని స్పష్టం చేశారు. సిఫార్సు లేఖలు తగ్గితే సామాన్య భక్తులకు పెద్దపీట వేయొచ్చన్నారు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి. అయితే సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచారు. సుప్రభాతం 2 వేలు, తోమాల, అర్చన 5 వేలు‌, కళ్యాణోత్సవం 2, 500, వేద ఆశ్వీరవచనం 10 వేలు, వస్త్రాలంకరణకు లక్ష రూపాయలు టిక్కెట్లుగా నిర్ణయించింది పాలకమండలి. సిఫార్సు లేఖల ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయమని స్పష్టం చేశారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. సామాన్య భక్తుల దర్శనాలకు మాత్రం ఎలాంటి ధరలు పెంచడం లేదని ప్రకటించారు.

Also Read: Andhra Pradesh: ఊరు మొత్తానికి ఏ గ్రేడ్ చేపలు దానం చేసిన సర్పంచ్.. రీజన్ తెలిస్తే గ్రేట్ అంటారు

కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు