Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు ఈ సేవలు బంద్.. టీటీడీ కీలక ప్రకటన
భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ నెలలో శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పుష్కరిణిలో పుణ్య స్నానాలను నిలిపివేయనున్నారు. అలాగే ఆర్జిత సేవలను కూడా నిలిపివేయనున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. అలాగే చంద్రగహణం సందర్భంగా..

తిరుమల వెళ్లే భక్తులకు టీటీటీ కీలక అలర్ట్ జారీ చేసింది. తిరుమలకు రోజూ లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. దీంతో భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా టీటీడీ ఎప్పటికప్పుడు దర్శన సమయాలు, స్వామివారి సేవలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ముందుగానే వెల్లడిస్తూ ఉంటుంది. దీని వల్ల భక్తులు ముందుగానే తెలుసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవచ్చు. తాజాగా భక్తుల కోసం టీటీడీ మరో కీలక ప్రకటన జారీ చేసింది. అదేంటంటే.. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఇప్పటినుంచే ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ఈ ఏర్పాట్లపై తిరుమలలోని శ్రీ పద్మావతి వసతి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో అధికారులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సేవలు బంద్
తెప్పోత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఈ నెల 23న ఫ్లోట్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. పుష్కరిణిలో తగినంత నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఫ్లోట్ కోసం ఆకర్షణీయమైన విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేయాలని సూచించారు. వరాహస్వామి ఆలయం వద్ద, నాలుగు మాడ వీధుల వెంబడి పండళ్లను నిర్మించాలని సూచించారు. ఇక తెప్పోత్సవాలు వచ్చే భక్తులకు సమాచారం అందించేందుకకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ నెలకొల్పనున్నారు. తెప్పోత్సవాల క్రమంలో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 5 వరకు భక్తులు పుష్కరిణిలో స్నానం చేయడాన్ని నిలిపివేయనున్నారు. పుష్కరిణి వద్ద అదనపు భద్రత కల్పించనున్నారు. ఇక ఫిబ్రవరి 26,27వ తేదీల్లో సహస్ర దీపాలంకార సేవలు, ఫిబ్రవరి28, మార్చి 1,2వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
శ్రీవారి ఆలయం బంద్
మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు క్లోజ్ చేస్తారు. దీంతో ఆ సమయంలో దర్శనాలు అన్నీ బంద్ కానున్నాయి. అనంతరం 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. ఇక ఉదయం 9 గంటల తర్వాత అన్నప్రసాదం పంపిణీ నిలిపివేస్తారు. అయితే క్యూలైన్లు, సీఆర్వో ఆఫీస్ దగ్గర భక్తులకు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. భక్తులు ఇవన్నీ గమనించి ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది. అటు మార్చి నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను త్వరలో టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ మేరకు తేదీలను ఇప్పటికే ప్రకటించింది.
