తిరుమల, ఆగస్టు 7: టీటీడీ పాలకమండలి పదవీకాలం రేపటి (ఆగస్టు 8)తో ముగుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షత న తిరుమలలో ఈరోజు (ఆగస్టు 7) ఆఖరి సమావేశం జరగనుంది. టీటీడీ కొత్త చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీఓ కూడా జారీ చేయడంతో రెండు దఫాలు చైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే ఆఖరి సమావేశం ఇదే కావడంతో కీలకంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 నుంచి వరుసగా రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ నెల 8 తో ముగుస్తోంది. ఈ రోజు వైవీ అధ్యక్షతన ఆఖరి పాలకమండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్ లో జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 29 మంది సభ్యులు ఉన్న పాలకమండలి ఆఖరి సమావేశంగా భేటీ కానుంది. పలు కీలక తీర్మానాలపై చర్చించనుంది.
4 ఏళ్ల పాటు వై వి సుబ్బారెడ్డి చైర్మన్ గా కొనసాగగా.. కొత్త పాలక మండలి చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి అవకాశం దక్కింది. విధేయత అనుభవం భూమనకు అనుకున్న పదవి దక్కేలా చేసింది. ఇప్పటికే 2004 నుంచి 2006 వరకు పాలక మండలి సభ్యుడుగా, 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా కొనసాగిన భూమన ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే గా టిటిడి బోర్డులో స్పెషల్ ఇన్వైటీ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు చైర్మన్ గా రెండోసారి శ్రీవారి ప్రథమ సేవకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం భూమనకు దక్కింది. అప్పుడు తండ్రి వైయస్ సీఎం గా ఉన్నపుడు ఇప్పుడు కొడుకు జగన్ సీఎంగా ఉన్నప్పుడు రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేసే ఇలాంటి అదృష్టం ఎవరికీ రాదంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. టిటిడి పట్ల పూర్తి అవగాహన ఉందంటున్న భూమన టిటిడి చైర్మన్ గా హిందూ ధార్మిక వ్యాప్తి కోసమే పనిచేస్తానంటున్నారు
వై వీ అధ్యక్షతన కొనసాగుతున్న పాలకమండలి పదవీకాలం 8 న ముగుస్తుండగా కొత్త చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఈ నెల 10 న బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.44 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి వద్ద చైర్మన్ గా రెండోసారి భూమన శ్రీవారి ప్రథమ సేవకుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. టీటీడీ చైర్మన్ గా ప్రభుత్వం భూమన ను ప్రకటించడంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తో పాటు టిటిడి యంత్రాంగమంతా ఆయన్ను కలిసి అభినందించింది. ప్రభుత్వ విప్ చెవిరెడ్డితో పాటు అభిమానులు పెద్ద ఎత్తున భూమన కలిసి అభినదించగా తిరుపతి గంగమ్మ ఆశీస్సులు పొందారు భూమన.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..