Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. గురువారం (ఆగస్టు 18) రూ. 300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తెలిపింది. ఉదయం 9 గంటలకు ఈ టికెట్లను టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచనుంది. వివిధ స్లాట్లలో టికెట్లను కేటాయించామని, శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం వేచిచూస్తున్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను చూసి మోసోవద్దని హెచ్చరించింది.
ఆరోజుల్లో సర్వదర్శనం మాత్రమే..
కాగా ఈనెలలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ రోజుల్లో కేవలం సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తామని, సర్వదర్శనం మాత్రమే అమలులో ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. కాగా మరోవైపు రేపు వాచీల ఈ-వేలం జరగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, ఇతర అనుబంధ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన వాచీలను వేలం వేయనున్నారు.
ఇది కూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..