Andhra Pradesh: కాణిపాకం ఉత్సవాలకు రావాలని సీఎంకు పిలుపు.. వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేత
వినాయకచవితి (Vinayaka Chavithi) గడువు సమీపిస్తోంది. కాణిపాక వరసిద్ధుడు వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆలయ అధికారులు ఆహ్వాన పత్రం అందించారు....
వినాయకచవితి (Vinayaka Chavithi) గడువు సమీపిస్తోంది. కాణిపాక వరసిద్ధుడు వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆలయ అధికారులు ఆహ్వాన పత్రం అందించారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్‌ఎస్ బాబు, కాణిపాకం (Kanipakam) దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో సురేష్ బాబు తదితరులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంతే కాకుండా ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వానపత్రికను కూడా సీఎంకు (CM Jagan) అందించారు. ఆహ్వాన పత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం ఆలయ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.
కాగా.. చారిత్రిక కథనం ప్రకారం గుడ్డి, మూగ, చెవుడు అంగ వైకల్యాలు కలిగిన ముగ్గురు అన్నాదమ్ములు ఉండేవారు. వారు తమ పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుంచి ఏతంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు అయిపోయింది. దాంతో నీరు కోసం ముగ్గురూ బావిని ఇంకా లోతుకు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న కాసేపటి తర్వాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలింది. ఆ రాతి నుంచి రక్తం రావడం గమనించారు. కొద్ది క్షణాలలో బావిలోని నీరంతా ఎర్రగా మారిపోయింది. స్వామి మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తిగా పోయి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకున్నారు. అంతలోనే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుంచి ఉద్భవించింది.
ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి కొబ్బరికాయలు కొట్టారు. నీటితో అభిషేకం చేశారు. ఆ కొబ్బరి నీరు ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలుస్తున్నారు. రానురాను కాణిపాకంగా మారింది. ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..