Tirupati By Election : తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో పలు రాజకీయ పార్టీలు వారి వారి అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. ఇక్కడ ఎలాగైనా గెలిచి ఉనికిని చాటుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం తరపున మాజీ కేంద్రమంత్రి వనబాక లక్ష్మిని బరిలోకి దింపగా.. బీజేపీ జనసేన కూటమి నుంచి రత్న ప్రభ అనే మాజీ ఐఏఎస్ అధికారిని ప్రకటించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థి పేరును ప్రకటించింది. చింతామోహన్‌ను తమ క్యాండెట్‌గా ప్రకటించింది. ఏప్రిల్ 17 న జరగునున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పట్టు సాధించాలన్ని విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి.
ఇక చింతా మోహన్ గారు 1984 లో 8వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తిరుపతి లోక్ సభ నియోజక వర్గానికి భారత జాతీయ కాంగ్రెస్ తరుపున పోటి చేసి ఎన్నికయ్యారు. తర్వాత 1989 లో జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొందారు. మూడోసారి కూడా 1998 లో 12 వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లోకూడా గెలుపొందారు. ఈ సమయంలో వీరు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2004 జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా 5వ సారి లోక్ సభకు ఎన్నికై సేవలందించారు. వీరు అనేక పార్లమెంటు కమిటీలలో సభ్యులుగా పనిచేశారు. 2009 లో జరిగిన 15 వ లోక్ సభకు ఆరో పర్యాయం ఎన్నికయ్యారు.
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయం కోసం కాంగ్రెస్ ధర్మయుద్ధం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతి నాలుగు కాళ్ల మండపం నుంచి కృష్ణాపురం ఠాణా వరకూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కరపత్రాలను పంచిపెడుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. అటు భాజపా ఇటు వైకాపా రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నాయన్న చింతామోహన్.. జరుగుతున్న వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇచ్చి అభివృద్ధి కోసం తిరుపతి వాసులు నిలబడాలన్నారు.