తిరుపతి, సెప్టెంబర్ 5: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పై వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులు తప్పుబట్టారు. గురువారం ఆదిమూలం భార్య గోవిందమ్మ టీవీ 9తో మాట్లాడుతూ.. ‘నా భర్త అలాంటివాడు కాదు. రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రపూరితంగానే ఇలాంటి అబండాలు వేస్తున్నారు. నా భర్త నలుగురు పిల్లలు తండ్రి. ఈ వయస్సులో ఇలాంటి పనులు ఎలా చేస్తారు? బాధ్యత గల ఒక తండ్రిగా బిడ్డలను పెంచి పెళ్ళిళ్ళు చేసారు. ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోరని నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన అందరికీ సహాయపడ్డారు. నలుగురికీ మంచి చేసే తత్వం ఉన్న వ్యక్తి నా భర్త ఆదిమూలం. అతని ఎదుగుదలను ఓర్వలేక కుట్రపూరితంగా అతని రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని కొందరు టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా నా భర్త కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు’
ఇంకా ఆమె ఈ విధంగా మాట్లాడారు.. ‘రెండవ సారి ఎమ్మెల్యేగా గెలవడంతో జీర్ణించుకోలేని కొందరు ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు. అందుకే తెరవెనుక కుట్రలు చేస్తున్నారు. ప్రస్తుతం నా భర్త ఆరోగ్య పరిస్తిస్థితి సరిగాలేదు. నిన్న రాత్రి చికిత్స కోసం చెన్నైకి వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలన్నీ ఫేక్. నకిలీ వీడియోలు. నామినేటెడ్ పదవులు కోసమే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. ఓటు వేయని వారు కూడా పదవుల కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదిమూలం కొడుకు సుమన్, భార్య గోవిందమ్మ, కూతుళ్లు, అల్లుడు జాన్ కెనడీ టీవీ9తో మాట్లాడారు.
కాగా తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ అధిష్టానం ఈ రోజు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్‌లో బాధితురాలు మీడియా సమావేశంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై గంటల వ్యవధిలోనే స్పందించిన టీడీపీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వెలువరించింది. ఆదిమూలం రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే.. 2014లో చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024లో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. సత్యవేడు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.