
తిరుమల తిరుపతి దేశస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. రాజశేఖర్ బాబు టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఈవో శ్యామలరావు అతన్ను సస్పెండ్ చేశారు. కాగా తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన రాజశేఖర్ టీటీడీలో ఏఈవోగా పనిచేస్తున్నారు. అయితే ఇతను ప్రతీ ఆదివారం స్థానికంగా ఉన్న చర్చిలో ప్రార్థనలు చేసేందుకు వెళ్తున్నారని.. అక్కడ ప్రార్థనల్లో పాల్గొంటున్నారని స్థానిక భక్తల నుంచి టీడీకి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన టీటీడీ అతనిపై వచ్చిన ఫిర్యాదులు నిజమేనని నిర్థారించుకుంది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఈవో శ్యామలరావు రాజశేఖర్ బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ఈవో శ్యామలరావు ప్రకటన విడుదల చేశారు. టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగిందని ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగిగా ఆయన సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగిందని.. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ విడుల చేసిన ప్రకటనలో ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.