Chandrababu Naidu: ఎట్టకేలకు విమానం ఎక్కిన చంద్రబాబు నాయుడు.. విమానాశ్రయంలో 9 గంటల హైడ్రామాకు తెర..
Chandrababu Naidu: ఏపీ రాజకీయాల్లో కాకరేపిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. తిరుపతి విమానాశ్రయంలో 9 గంటల పాటు నిరసనకు దిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ..
Chandrababu Naidu: ఏపీ రాజకీయాల్లో కాకరేపిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. తిరుపతి విమానాశ్రయంలో 9 గంటల పాటు నిరసనకు దిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు వెనుదిరిగి వెళ్లారు. అయితే షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.25 గంటలకు హైదరాబాద్ విమానం ఎక్కారు. చంద్రబాబు వెనుదిరిగి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని నిరసన తెలిపేందుకు చిత్తూరుకు బయలుదేరారు. దీంతో ఆయనను విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. నిరసన ర్యాలీకి అనుమతి లేదని, కరోనా నిబంధనలు, ఎన్నికల కోడ్ కారణంగా అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో చంద్రబాబు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వివాదానికి దిగారు.
పోలీసుల తీరుకు చంద్రబాబు నాయుడు విమానాశ్రయంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వెనక్కి తగ్గలేదు. ఇక మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా నేలపైనే బైఠాయించారు. ‘సర్ మీరు పెద్దవారు ఇలా నేలపై కూర్చోవద్దంటూ’ ఏఎస్పీ స్థాయి అధికారి వేడుకున్నా ఆయన ఏ మాత్రం తగ్గకుండా నిరసన కొనసాగించారు.
మరోవైపు చంద్రబాబు నాయుడును విమానాశ్రయంలో అడ్డుకోవడాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3.10 గంటలకు విమానంలో హైదరాబాద్‌కు పంపేందుకు ఏర్పాటు చేసినా ఆయన మాత్రం వెనక్కి తగ్గకుండా అట్లాగే బైఠాయించారు. దీంతో పోలీసులు, అధికారులు చర్చలు జరిపారు. ఇక షెడ్యూల్ ప్రకారం తాను బుక్ చేసుకున్న విమానంకు బయలుదేరేందుకు చంద్రబాబు అంగీకరించడంతో పోలీసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
నిర్బంధంపై చంద్రబాబు మండిపాటు
కాగా, విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవడంతో పోలీసులపై మండిపడ్డారు. ఎయిర్ పోర్టులోనే నిర్బంధిస్తారా అంటూ అక్రోశం వెల్లగక్కారు. కక్ష సాధింపులకే చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. తాను 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేశానని, ఇలాంటి వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా..? అంటూ మండిపడ్డారు. ఏదీ ఏమైనా 9 గంటల ఉత్కంఠ తర్వాత చంద్రబాబు రిటర్న్ ఫ్లైట్ ఎక్కడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.