AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: గుడ్ న్యూస్.. శ్రీవారి భక్తులకు లడ్డూతో పాటు మరో ప్రసాదం..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు, తిరుమల, తిరుపతిలోని అనుబంధ ఆలయాల నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే స్వఛ్చమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, సొంతంగా తయారు చేసుకోవాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది.

Tirumala: గుడ్ న్యూస్..  శ్రీవారి భక్తులకు లడ్డూతో పాటు మరో ప్రసాదం..
Tirumala Tirupati Devasthanams
Ram Naramaneni
|

Updated on: Mar 31, 2023 | 8:24 PM

Share

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీకి రోజువారీ అవసరమయ్యే 4వేల లీటర్ల పాలను ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ తయారు చేస్తున్న అగర బత్తీల ఉత్పత్తిని డిమాండ్ కు తగినట్లుగా పెంచే చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్వీ గోశాలలో నిర్మించిన ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్, టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసే అగరబత్తుల రెండవ యూనిట్ ను శుక్రవారం టీటీడీ ‌చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు, తిరుమల, తిరుపతిలోని అనుబంధ ఆలయాల నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే స్వఛ్చమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, సొంతంగా తయారు చేసుకోవాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం దేశవాళీ గోవుల పెంపకం, దేశవాళీ గో జాతులను అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు తయారుచేసి వాటిని అమలు చేయడం జరిగింది. లేగ దూడల పెంపకం, గోవుల పెరుగుదల, వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి, నాణ్యమైన పాల ఉత్పత్తికి మనం గోవులకు అందించే మేతకు అవినాభవ సంబంధం ఉంటుంది.  ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి, దేశవాళీ గోసంతతిని మరింత అభివృద్ధి చేయడం కోసం శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన న్యూటెక్‌ బయోసైన్సెస్‌ సంస్థతో మూడు రకాల ఫార్ములాలతో కల్తీ లేని నాణ్యమైన పశువుల దాణా సొంతంగా తయారు చేసుకోవడానికి ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఇందుకోసం రూ.11 కోట్లతో టిటిడి సొంతంగా ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ నిర్మించుకుంది.ఇందులో దాత ఒకరు రూ 2కోట్లు విరాళం అందించారు. ఈ ప్లాంట్‌లో శుక్రవారం(మార్చి 31 నుంచి) నుండే దాణా ఉత్పత్తి జరుగుతుంది.

టిటిడి అవసరాలకు రోజుకు అవసరమయ్యే నాలుగు వేల లీటర్ల పాలను గోశాలలోనే ఉత్పత్తి చేయడం కోసం ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ ఎంతో ఉపయోగపడుతుంది. గోవులకు బలవర్ధకమైన సమగ్రదాణా అందించడం ద్వారా పాల ఉత్పత్తి ఇప్పటికంటే 10 నుంచి 15 శాతం పెరుగుతుంది. ఇక్కడ తయారుచేసే సమగ్ర దాణాను గోవులకు అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు గోవులు ఇచ్చే పాలలో ప్రొటీన్‌ శాతం మరింత అధికంగా లభిస్తుంది. దీనివల్ల టిటిడికి ప్రతి రోజు అవసరమయ్యే 4 వేల లీటర్ల పాల అవసరాన్ని దశలవారీగా చేరుకునే అవకాశం లభిస్తుంది. దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయడం కోసం దాతల సహకారంతో 500 దేశవాళీ గోవులను సమీకరించాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి ఇప్పటి వరకు 120కి పైగా గిర్, కాంక్రీజ్ దేశవాళీ జాతుల గోవులను తీసుకుని వచ్చాము.

అగరబత్తుల రెండవ యూనిట్‌

టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో పరిమళభరితమైన అగరబత్తులను తయారుచేసి భక్తులకు అందించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. బెంగళూరుకు చెందిన దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సహకారంతో 2021 సెప్టెంబరు 13వ తేదీన టీటీడీ ఈ అగరబత్తులను తయారుచేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు రూ.30.66 కోట్ల విలువైన అగరబత్తులను భక్తులకు విక్రయించడం జరిగింది.

ఈ అగర్బత్తులకు భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్‌ రావడంతో ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని నిర్ణయించారు అధికారులు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌ వద్దే రూ 2కోట్లతో రెండవ యూనిట్‌ సిద్ధం చేయడం జరిగింది.  ప్రస్తుతం రోజుకు 15 వేల అగరబత్తుల ప్యాకెట్లు తయారవుతున్నాయి. రెండవ యూనిట్‌ ప్రారంభించడం వల్ల ఈ సంఖ్య రోజుకు 30 వేల ప్యాకెట్లకు పెరుతుంది. దీనివల్ల సుమారు 200 మంది స్థానిక మహిళలకు ఉపాధి లభిస్తోంది. భక్తులు శ్రీవారి లడ్డు ప్రసాదంతో పాటు అగరబత్తులను కూడా ప్రసాదంగా అందించడానికి ముందుకొస్తున్నారు.

రాబోయే రోజుల్లో స్వామివారి అగరబత్తులు ప్రతి భక్తుడికి చేరే అవకాశం ఉంది. డిమాండ్‌కు తగినట్టు ఉత్పత్తిని కూడా పెంచే దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..