Students Drowned in Swarnamukhi River: ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా రేణిగుంట మండలం జి.వి.పాలెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. మొత్తం నలుగురు నదిలో కొట్టుకుపోగా.. ఒకరిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. ఆదివారం ఉదయం నలుగురు విద్యార్థులు నదిలో ఈతకు వెళ్లారు. వారిలో జి.వి.పాలెం ఎస్సీ కాలనీకి చెందిన గణేష్ (15), యుగంధర్ (14), ధోని (16) గల్లంతు కాగా.. లిఖిత్ సాయి ప్రాణాలతో బయటపడ్డాడు. లిఖిత్ సాయిని అక్కడ చేపలు పడుతున్న స్థానికులు కాపాడారు. ఈ ఘటన సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో గాలిస్తున్నారు.
కాగా.. స్వర్ణముఖి నదిలో విద్యార్థుల గల్లంతైన విషయాన్ని తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాగా.. ధోని రేణిగుంట శ్రీనివాస జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుండగా. గణేష్ పాపా నాయుడు పేట జడ్పీ హైస్కూల్లో చదువుతున్నాడు.
Also Read: