తిరుమలలో చిరుతల సంచారం మరువక ముందే మరొక క్షేత్రంలో చిరుత సంచారం కలకలం రేపింది. భక్తులు నడిచి వెళ్లే దారిలో రోడ్డుపై చిరుత ఉండటాన్ని గుర్తించిన భక్తులు వాహనం ఆపి వీడియో తీశారు. అయితే ఎంతసేపటికీ చిరుత కదలకపోవడంతో భక్తులు వాహనం హారన్ కొట్టడంతో అడవుల్లోకి పారిపోయింది చిరుత.. ఆలయ సమీపంలో చిరుత సంచారం తెలుసుకున్న భక్తులు భయాందోళన చెందుతున్నారు.
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకొనలోని నరసింహస్వామి ఆలయం వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున ఆలయానికి సమీపంలోని అటవీశాఖ అతిథి గృహం వద్ద చిరుతను వాహనంలో వెళ్తున్న భక్తులు గుర్తించారు. నెల్లూరు, కడప జిల్లాలను అనుసంధానం చేసే వెలుగొండ అడవులు చిరుతలకు ఎంతో ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. ఎంతో విశాలంగా దట్టంగా ఉండే ఈ అడవుల్లో చిరుతలు, పెద్ద పులి ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
గడిచిన రెండేళ్ల కాలంలో చిట్వేల్ సరిహద్దు వద్ద మూడు చిరుతలను ప్రయాణికులు గుర్తిచారు. అలాగే రాపూరు సమీపంలోని అడవుల్లో చిరుత సంచారంతో పాటు ఎపురు గ్రామ సమీపంలో అడవికి వెళ్లిన పశువులపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఉదయగిరి అటవీ దారిలో వెళ్తున్న వాహనంపై చిరుత దాడి చేసిందని వాహన దారుడు అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చాడు. అయితే వాహనంపై చిరుత దాడి చేయడంపై ఇప్పటికి అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా పెంచలకొనలో మరోసారి చిరుత సంచారంపై అధికారులు అప్రమత్తమయ్యారు. 2014లో అప్పటి అటవీశాఖ లెక్కల ప్రకారం వెలుగొండల్లో 15 కి పైగా చిరుతలు ఉన్నట్లు అటవీశాఖ లెక్కలు చెప్తున్నాయి. అయితే మరోసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే పెంచలకోనలో చిరుత సంచారం విషయం తెలుసుకున్న జిల్లా అటవీశాఖ అధికారి మహబూబ్ బాషా కోనకు చేరుకుని విచారణ చేశారు. చిరుత సంచారం వాస్తవమేనని భక్తులు ఎవరు ఒంటరిగా తిరగవద్దని ఆయన సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి