Tiger Tension: ఏపీలోని పలు జిల్లాల్లో పెద్ద పులల సంచారం.. పొలాల్లోకి వెళ్లాలంటేనే వణుకుతున్న ప్రజలు..
ద్వారకాతిరుమల మండలం సత్తన్నగూడెం గ్రామ శివారులో పులి పాదముద్రలను గుర్తించిన రైతులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా పెద్దపులి పాదముద్రలు సేకరించారు. ఇవి.. మగ పెద్దపులి పాదముద్రలుగా ప్రాథమికంగా నిర్థారించారు. అధికారికంగా గుర్తించేందుకు పాదముద్రలను వైల్డ్ లైఫ్ ల్యాబ్‌కు తరలించారు అటవీశాఖ అధికారులు.
గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఏదొక ప్రాంతంలో పెద్దపులి కనిపిస్తూ కలకలం సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో పెద్ద పులులు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏలూరు జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తోంది. ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ద్వారకాతిరుమల మండలం సత్తన్నగూడెం గ్రామ శివారులో పులి పాదముద్రలను గుర్తించిన రైతులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా పెద్దపులి పాదముద్రలు సేకరించారు. ఇవి.. మగ పెద్దపులి పాదముద్రలుగా ప్రాథమికంగా నిర్థారించారు. అధికారికంగా గుర్తించేందుకు పాదముద్రలను వైల్డ్ లైఫ్ ల్యాబ్‌కు తరలించారు అటవీశాఖ అధికారులు.
దెందులూరు మండలం పేరుగుగూడెం, మేదినరావుపాలెంలోని మొక్కజొన్న తోటలో పులి అడుగుజాడలు గుర్తించారు. గతవారం రోజులు క్రితం బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్లలో సంచరించగా.. తాజాగా.. ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి అడుగుజాడలు కనిపించడంతో జిల్లా ప్రజలు భయపడిపోతున్నారు. పెద్దపులి సంచారంతో ఆయా ప్రాంతాల రైతులు, కూలీలు పొలాల్లో పనులకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. పెద్దపులిని బంధించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక.. పెద్దపులిని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు అమర్చి.. బంధించేందుకు బోన్లు సిద్ధం చేశారు అటవీశాఖ అధికారులు.
మరోవైపు.. ప్రకాశం జిల్లాలోనూ పులుల సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అర్ధవీడు మండలం లక్ష్మీపురం, మాగుటూరు, నాగులవరం గ్రామ సమీపాల్లోని గుమ్మనికుంటలో పెద్దపులి నీళ్లు తాగేందుకు వస్తుంది. గత రెండు రోజులుగా పెద్దపులి తిరుగుతున్నట్లు గుర్తించిన స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పొలాల్లో పులి పాదముద్రలను గుర్తించిన రైతులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు.. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా.. పెద్దపులి అడుగుజాడలు కనిపించాయి. దాంతో.. పెద్దపులి సంచారాన్ని ధ్రువీకరించి.. స్థానిక ప్రజలకు ప్రమాదం లేకుండా చర్యలు చేపట్టారు అటవీశాఖ అధికారులు. మొత్తంగా.. ఈ మధ్య కాలంలో ఏపీలోని పలు జిల్లాల్లో పులల సంచారంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని పొలాల్లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..