
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అనకాపల్లిలోని ఆ పల్లెలో గుర్రాలు దౌడు తీస్తాయి. పోటీ పడుతూ పరిగెడతాయి. నువ్వా నేనా అన్నట్టు ముందుకు దూసుకుపోతాయి. రాజసాన్ని ఉట్టిపడేలా ఆ గుర్రాల పరుగులు పెడుతూ ఉంటే జనాల కేరింతలతో ఆ పోటీలు ఉత్సాహాన్ని మరింత పెంచుతాయి. కోనసీమ కోడిపందాలకు కేరాఫ్ అయితే.. అనకాపల్లి జిల్లాలో ఉత్సాహంగా గుర్రాల పోటీలు సాగిపోతూ ఉన్నాయి. కోడిపందాలు, ఎడ్ల పోటీలు కామన్.. కానీ పండక్కి అనకాపల్లి జిల్లాలో గుర్రాల పోటీలకు ప్రత్యేకత. స్థానిక సర్పంచులు నేతల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ పోటీలో నిర్వహిస్తూ జనాల్లో ఉత్సాహం పెంచుతారు. మునగపాక మండలం ఉమ్మలాడలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.
పోటీలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 30 గుర్రాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే గుర్రాలకు ఆరు బహుమతులు అందజేస్తున్నారు. తొలి బహుమతి 12,000, ద్వితీయ బహుమతి 10000, తృతీయ స్థానంలో నిలిచిన గుర్రానికి ఎనిమిది వేల రూపాయల నగదు బహుమతిని అందిస్తున్నారు. గుర్రాల పోటీలు చూసేందుకు భారీగా చేరుకున్నరు జనం.
అలాగే.. బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్టలో ఉత్సాహంగా సంక్రాంతి రోజు గుర్రాల పోటీలు సాగాయి. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 10 గుర్రాలు పోటీపడ్డాయి. గుర్రాలు పరుగులు తీస్తూ ఉంటే కేరింతలు కొడుతున్నారు జనం. తమ ఫేవరెట్ గుర్రానికి ఎంకరేజ్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఈ సంక్రాంతికి.. అనకాపల్లి జిల్లాలో.. ఎడ్ల పోటీలు, పుట్ల పోటీలతో పాటు.. గుర్రం పోటీలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందుకే కేవలం అనకాపల్లి జిల్లా నుంచి కాదు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం ఈ పోటీలను చూసేందుకు తరలివస్తుంటారు. పోటీల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..