Three-day-old baby kidnapped: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందు అదృశ్యం సంఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్థరాత్రి సమయంలో మగశిశువును నిందితులు అపహరించారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కొత్తపేట పోలీసులు ఈ కేసును చేధించారు. గుంటూరు కొత్తపేట పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు శిశువును ఆసుపత్రి సిబ్బంది సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా.. పోలీసులు నిందితుల జంటను నెహ్రునగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
జీజీహెచ్ సిబ్బంది ఒకరు ఈ కిడ్నాప్‌కు ప్లాన్ రచించినట్లు పేర్కొన్నారు. నిందితులు హేమవర్ణుడు, పద్మగా పోలీసులు గుర్తించారు. హేమవర్ణుడు ఆసుపత్రిలో వార్డ్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతనితో పద్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని.. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి బాలుడిని ఎత్తుకెళ్లారని తెలిపారు. వారిద్దరూ.. బాలుడిని ఎందుకు కిడ్నాప్ చేశారు.. ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై పోలీసులు నిందితుల నుంచి రాబడుతున్నారు.
కాగా..పెద కాకానికి చెందిన ప్రియాంక అనే మహిళ 12వ తేదీన జీజీహెచ్‌లో ప్రసవించింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వేళ 1.30 సమయంలో బాబుని తీసుకుని నాయనమ్మ, అమ్మమ్మ వార్డ్ బయటకు వచ్చారు. అనంతరం వారు బాలుడుని పక్కన ఉంచుకుని నిద్రపోయారు. అ క్రమంలో అర్ధరాత్రి నిందితులు బాలుడిని అపహరించుకుపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు జీజీహెచ్ అధికారులకు, పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలించి గంటల్లోనే వారిని పట్టుకున్నారు.
Also Read: