Andhra: ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా..? ఆ పరశురాముడికే ఆశ్రయమిచ్చిన వ్యక్తి..

కడప జిల్లా అత్యరాల పేరుకి వెనుక పురాణం, జానపద విశ్వాసం ముడిపడి ఉంది. పరశురాముడి కథతో అనుసంధానమైన ఈ ప్రాంతంలో ఏకా తాతయ్య గ్రామ రక్షకుడిగా, ధర్మానికి ప్రతీకగా ప్రజల నమ్మకాల్లో నిలిచిపోయారు. పురాణ గ్రంథాల్లో ప్రస్తావన లేకపోయినా, తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాసమే ఏకా తాతయ్య క్షేత్రానికి ప్రాణంగా మారింది.

Andhra: ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా..? ఆ పరశురాముడికే ఆశ్రయమిచ్చిన వ్యక్తి..
Eka Tatayya

Edited By:

Updated on: Jan 05, 2026 | 8:22 PM

అత్యరాల ఈ పేరుకు ఒక పెద్ద కథే ఉంది. పరశురాముడు తన తల్లిని చంపిన తరువాత తన గొడ్డలిని తీసుకొని అనేక నదులలో ఆ గొడ్డలిని కడిగినా ఎక్కడా కూడా ఆ గొడ్డలిపై ఉన్న రక్తపు మరకలు పోలేదట. అయితే కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో గల కామాక్షి త్రీతేశ్వర ఆలయం వద్ద ప్రవహించే బహుదానదిలో పరశురాముడు గొడ్డలిని కడిగితే అప్పుడు.. రక్తపు మరకలు పోయినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఇక్కడ పరుశురాముడి చేసిన హత్యలు రాలిపోయాయి. కాబట్టి దీనిని హత్య రాలె అని పిలిచేవారు. కాలక్రమంలో అత్యరాలగా మారినట్లు స్థల పురాణం చెబుతుంది. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి కూడా ప్రస్తావన చేసుకోవాలి. పరశురాముడికి ఆ సమయంలో ఆశ్రయం ఇచ్చి మార్గదర్శనం చేశారట ఏకా తాతయ్య. పరశురాముడు ఎక్కడైతే ఉంటాడో.. ఆయన ఎదురే నేను కూడా ఉంటానని శపథం చేశారట ఏకా తాతయ్య. అలాగే తన కోరిక మేరకు ప్రస్తుతం బహుద నది ఒడ్డున ఉన్న పరశురామ దేవాలయంలో ఆయన విగ్రహానికి ఎదురుగా ప్రతిష్టించబడ్డారు.

ఇంతకీ ఏకా తాతయ్య ఎవరు..?

కడప జిల్లా అత్తిరాళ్ల ప్రాంతంలో కొలువై ఉన్న ఏకా తాతయ్య… తరతరాలుగా ప్రజల గుండెల్లో నిలిచిన జానపద దేవుడు. పరశురాముడి కథతో ముడిపడ్డ ఈ క్షేత్రానికి నేటికీ వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. పురాణ గ్రంథాల్లో ప్రత్యక్ష ప్రస్తావన లేకపోయినా ప్రజల నమ్మకమే ప్రాణంగా నిలిచిన దేవుడు ఏకా తాతయ్య. కడప, రాయచోటి, అత్యరాల పరిసర గ్రామాల్లో గ్రామ రక్షకుడిగా, న్యాయ దేవుడిగా ఆయనను పూజిస్తారు. స్థానిక కథనాల ప్రకారం ఏకా తాతయ్య పరశురాముడికి మాతామహుడిగా అంటే.. తల్లి రేణుకాదేవి తండ్రిగా ప్రజలు విశ్వసిస్తున్నారు. తల్లి రేణుకను వధించిన అనంతరం పశ్చాత్తాపంతో ఉన్న పరశురాముడు ఈ అత్యరాల ప్రాంతానికి వచ్చాడని కథనం. తన గొడ్డలిపై ఉన్న రక్తాన్ని
ఈ ప్రాంతంలోని పవిత్ర జలంలో కడిగి శాంతిని పొందాడని భక్తుల విశ్వాసం. ఆ సమయంలో పరశురాముడికి ఆశ్రయం, మార్గదర్శనం చేసినవాడు
ఏకా తాతయ్య అని స్థానికులు చెబుతున్నారు. అందుకే ఏకా తాతయ్యను గ్రామ రక్షకుడిగా, ధర్మానికి ప్రతీకగా భావిస్తారు.

ప్రతి ఏడాది జరిగే జాతరకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఏకా తాతయ్య సాక్షిగా ఏదైనా ప్రమాణం చేస్తే న్యాయం జరుగుతుందని న్యాయం, ధర్మం, రక్షణకు ప్రతీకగా జానపద దేవుడిగా నిలిచిన ఏకా తాతయ్య ఇప్పటికీ ప్రజల విశ్వాసానికి కేంద్రబిందువు గానే కొనసాగుతున్నారు. కాగా ఏకా తాతయ్య విగ్రహానికి మన తలను తాకిస్తే తలనొప్పి, పార్శ్వనొప్పి పోతాయనే విశ్వాసం స్థానిక ప్రజల్లో ఉంది.