Andhra: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. ఆ సమస్య పరిష్కారానికి ‘రెవెన్యూ క్లినిక్’
ఆరోగ్య సమస్యల పరిష్కారానికి హెల్త్ క్లినిక్‌లు ఉన్నట్టే..భూముల సమస్య పరిష్కారానికి కూడా 'రెవెన్యూ క్లినిక్' పేరుతో సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పలు జిల్లాలో విజయవంతమైన రెవెన్యూ క్లినిక్‌లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసలేంటి రెవెన్యూ క్లినిక్..? వీటి ద్వారా ఎలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది..?

జిల్లా కలెక్టరేట్లలో ప్రతివారం నిర్వహించే గ్రీవెన్స్‌డేలో వచ్చే అర్జీల్లో అధికశాతం భూముల సమస్యలపైనే ఉంటున్నాయి. ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులను పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఈ రెవెన్యూ క్లినిక్ పనిచేస్తుంది. రెవెన్యూ క్లినిక్‌లో రెవెన్యూ అధికారులతో పాటు జిల్లాలోని తహసీల్దార్లు అందుబాటులో ఉంటారు. ప్రజల నుండి పట్టాదారు పాస్‌పుస్తకం, రీసర్వే వంటి 14 రకాల సమస్యలపై అర్జీలు స్వీకరించేందుకు ప్రత్యేక టేబుళ్లు అందుబాటులో ఉంటాయి. మొదట డెస్క్ స్థాయిలో అర్జీని పరిశీలిస్తారు. ఆ తర్వాత దానిని సంబంధిత తహసీల్దార్‌కు పంపిస్తారు. అనంతరం ఫీల్డ్ వెరిఫికేషన్, సీనియర్ అధికారుల సమీక్షించిన తర్వాత సమస్యను పరిష్కరిస్తారు. సమస్య పరిష్కారంపై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా అర్జీదారుల అభిప్రాయాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
రెవెన్యూ క్లినిక్‌లో 14 రకాల అంశాలపై పరిష్కారం లభిస్తుంది. రీ సర్వే లోపాలు, ఎఫ్-లైన్ పిటీషన్లు, అసైన్డ్ 1బీ, డీపట్టా, వెబ్‌ల్యాండ్‌లో విస్తీర్ణం నమోదు, డీ పట్టా భూముల ఆక్రమణలు, మ్యుటేషన్ లోపాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, 22ఏ నుంచి భూముల తొలగింపు, 1-70 చట్టం అమలు, ROFR మంజూరు, జాయింట్ LPMల విభజన, సింగిల్ LPA విడదీయడం, హద్దుల సవరణ వంటి ఫిర్యాదులపై దరఖాస్తులు స్వీకరిస్తారు.
రెవెన్యూ క్లినిక్‌లో సేకరించిన ప్రతి అర్జీకి ఒక ఆన్‌లైన్ నంబర్ కేటాయిస్తారు. దాంతో పాటు దరఖాస్తుదారుల ఫోన్, ఆధార్ నంబర్‌లను కూడా నమోదు చేస్తారు. అర్జీని స్వీకరించాక.. దాని పరిష్కారం ఎలా ఉంటుందో తెలిపే కార్యాచరణకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని దరఖాస్తుదారుకు అందిస్తారు. ఈ కాపీలో సమస్య తీవ్రత, పరిష్కారమయ్యే సమయం వంటి వివరాలు ఉంటాయి. అనంతరం దీనిపై డిప్యూటీ కలెక్టరు సంతకం చేస్తారు. ఈ రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు వీలు కాకపోతే, ఎంత సమయం పడుతుందో నిర్దిష్ట గడువు విధించి, ఆ లోపు సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఆన్‌లైన్‌లో అప్లై చేసే వారికోసం 1100 హెల్ప్‌లైన్ నంబర్ కూడా అందుబాటులోకి తెచ్చింది.
