
అమరావతి రైతుల పాదయాత్ర రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాజమండ్రి ఆజాద్ చౌక్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆయా పార్టీల కార్యకర్తలు వాటర్ బాటిల్స్, చెప్పులు విసురుకున్నారు. కుర్చీలను గాల్లోకి లేపి విసిరే ప్రయత్నం చేశారు. ఇరువైపులా ఒకరిని మరొకరు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. దాదాపు అరగంటసేపు ఆజాద్ చౌక్ రణరంగంగా మారింది. అంతా ఏం జరుగుతుందోనని.. పరుగులు తీశారు.
కాగా.. అరసవిల్లి వైపు వెళుతున్న అమరావతి రైతుల పాదయాత్ర ఆజాద్ చౌక్ మీదుగా వెళ్లింది. అక్కడే మూడు రాజధానులకు వ్యతిరేకంగా సభ పెట్టారు వైసీపీ నేతలు. ఎంపీలు మార్గాని భరత్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. సరిగ్గా పాదయాత్ర ఆజాద్ చౌక్‌కు రాగానే ఉద్రిక్తత మొదలైంది. ఇరువైపుల వారు ఒక దగ్గరకు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బారికేడ్లు సైతం ఏర్పాటు చేశారు. అయినా సరే ఆయా పార్టీల కార్యకర్తలు గొడవకు దిగాయి.
ఈ సమయంలో అమరావతి పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల నిరసన తెలిపారు. గోబ్యాక్ అంటూ వికేంద్రీకరణ మద్దతుదారులు నినాదాలు చేశారు. నల్లబెలూన్లతో వికేంద్రీకరణ మద్దతుదారుల నిరసన తెలిపారు. దీంతో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ, వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరు వైపుల వారు రెచ్చగొట్టుకునే విధంగా చేసుకుని చెప్పులు, వాటర్ బాటిళ్లు విసురుకున్నారు. అరగంట తర్వాత పాదయాత్ర అక్కడి నుంచి ముందుకు కదలడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే టీడీపీ, జనసేన కార్యకర్తలు రౌడీషీటర్లలా వ్యవహరించారని ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు.
హేయమైన చర్య..
ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. అమరావతి రైతులపై వైసీపీ దాడి హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి.. జగన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతుందన్నారు. నేరస్తుడి పాలనలో రాష్ట్రం నాశనమవుతోందని మండిపడ్డారు. ఎంపీ భరత్, పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరిచి వ్యవహరించారన్నారు. పట్టపగలు రైతులపై పెట్రోల్ సీసాలు, బీరు సీసాలు, కర్రలతో దాడి చేస్తున్నా పోలీసులకు పట్టదా? అని ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో జరుగుతున్న పాదయాత్రకు రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీ మార్గాని భరత్ తో పాటు దాడిలో పాల్గొన్న వైసీపీ నేతలందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..