ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే రెండింటిని కైవసం చేసుకున్న తెదేపా.. మూడో స్థానంలో కూడా విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ (కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీగా.. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల మెజారీటీతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాలరెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ రాకపోవడంతో, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు.
ఈ కౌంటింగ్ లో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, వెన్నపూస రవీంద్ర రెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయని తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన అనంతరం భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపుని ప్రకటించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ తెలిపారు.
అయితే ఇక్కడ ప్రతి రౌండ్ కౌంటింగ్‌లోనూ టీడీపీ, వైసీపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది. అలాగే ఈ స్థానంలో మొత్తం 49మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. విశేషమేమంటే కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే టీడీపీ అభ్యర్థి రామగోపాలరెడ్డి విజయం ఖాయమని తెదేపా శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. ఈ మేరకు రాయలసీమలోని పలు జిల్లాల్లో టీడీపీ శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నాయి. మరోవైపు ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని వైసీపీ ఆందోళనకు దిగింది.
జగన్ రెడ్డి సొంత జిల్లా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసి ఉన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు. పులివెందులలో సైతం దశాబ్దాల చరిత్రను తెలుగుదేశం తిరగరాసింది.#ByeByeJaganIn2024 pic.twitter.com/W36igf4ekN
— Telugu Desam Party (@JaiTDP) March 18, 2023
కాగా, అంతకముందు కూడా కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ విశ్వేశ్వరరెడ్డి కింద కూర్చుని నిరసన తెలిపారు. మూడో రౌండ్ నుంచి రీకౌంటింగ్ చేయాలని వైసిపి నేతలు పట్టుబటట్డంతో, రీకౌంటింగ్ వీలు కాదని కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేసారు. ఇదే విషయం రాతపూర్వకంగా ఇవ్వాలని వైసీపీ నేతలు పట్టుపడుతున్నారు. అయితే వారికి కలెక్టర్ నాగలక్ష్మి నచ్చచెప్పి అందోళనలను విరమింపజేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..