Yanamala Ramakrishnudu: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమన రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహానాడు ఏర్పాటు కోసం ముందు అనుమతులు ఇచ్చి తర్వాత నిరాకరించడం అన్యాయం అన్నారు. మే 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా చేస్తామని తెలిపారు. మహానాడు ఏర్పాట్లకు అనుమతి నిరాకరణపై ఆయన మాట్లాడుతూ..’ప్రభుత్వం అంటే అందరిది. తాము ఎన్నికయ్యాం కాబట్టి రాష్ట్రం అంతా తామే అన్నట్టు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. మహానాడు ఏర్పాటుకై మినీ స్టేడియం కోసం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాం, కలెక్టర్ ముందు అనుమతించి తరువాత నిరాకరించారు. ఇది సరైంది కాదు, బ్యూరోక్రాట్లు స్వతంత్రంగా వ్యవహరించాలి. గతంలో కేటాయించి, ఇప్పుడు ఎందుకు నిరాకరించారన్న దానిపై అధికారులు రాతపూర్వకంగా బదులు ఇవ్వాలి. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో ఉండేది రెండేళ్లే, తర్వాత దిగిపోతారు. అప్పుడు అధికారులు ఏం చేస్తారు’ అంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వ స్థలంలో ఎవరైనా డబ్బులు చెల్లించి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని, మినీ స్టేడియంలో మహానాడు ఏర్పాటు చేస్తామంటే జగన్ ఎందుకు భయపడుతున్నారు అంటూ చురకలు అంటించారు. స్థలం కేటాయించనంత మాత్రాన మహానాడు ఆగదని తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పై జనం తిరగబడుతున్నారని, మూడేళ్లలో అన్ని రంగాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో సహజ వనరులను దోపిడీ చేసి వైసీపీ కార్యకర్తలు జేబుల్లో వేసుకుంటారని, అది ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలన్నారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయే నాటికి రూ. 11 లక్షల కోట్లు అప్పులు చేస్తారని యనమల అంచనా వేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీ పరిపాలన వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు భవిష్యత్తులో నష్టపోతారని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ సీబీఐ కేసుల్లో రూ. 43 వేల కోట్ల అవినీతి జరిగినట్లు తేలిందన్న యనమల రూ. 5 వేల కోట్ల ఆస్తులను అటాచ్ చేశారన్నారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము కాబట్టి, దానంతటినీ ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని యనమల డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..