వైసీపీ (YCP) ప్రభుత్వ తీరుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యలను ఖండించారు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాల్సిన అంశాలపై మాట్లాడాలే కానీ అనవసర విషయాలపై మాట్లాడవద్దని సూచించారు. వైసీపీపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి వరదలతో సర్వం కోల్పోయిన ప్రజల వద్దకు వెళ్లి పరామర్శిస్తున్న సీఎం జగన్.. చంద్రబాబు (Chandrababu) గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే పనిగట్టుకుని ప్రతిపక్ష నేతలను తిట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా (Special Status) ఇవ్వాలని ఒక్క వైసీపీ ఎంపీ అయినా అడిగారా అని నిలదీశారు. మూడేళ్లుగా ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తుశద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేసి, చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.
మాట తప్పం.. మడమ తిప్పం అనే జగన్ సిద్దాంతం ఏమైంది..? ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీల రాజీనామా డిమాండ్ చేసిన జగన్ ఇప్పుడు ఎందుకు తన ఎంపీలతో రాజీనామా చేయించడం లేదు..? విశాఖ రైల్వే జోన్ ప్రకటన వచ్చినా నిధులు విడుదల చేయకపోవడంపై జగన్ ఏం సమాధానం చెబుతారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఇప్పుడొచ్చిన మంత్రికి ఏమీ తెలియదు. పోలవరం నిర్వాసితులను ముంచేసింది వైసీపీనే.
– రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ
మరోవైపు.. గోదావరి వరదలతో ముంపునకు గురైన కోనసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాలను సీఎం జగన్ సందర్శించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బాధితులను ఆదుకున్నామన్నారు. వరద బాధితులను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించామని.. పశువులకు నోరు ఉంటే అవి కూడా మా సహాయాన్ని మెచ్చుకునేవి సీఎం జగన్ వివరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..