AP Politics: భీమిలి సీటుపై గంటా కర్చీఫ్.. విజయగంట మోగించేందుకు తయార్
రాజకీయాల్లో ఆయన దారి...ఎప్పుడూ కొత్త దారే! యస్. ఒకసారి పోటీ చేసిన సీటులో మళ్లీ పోటీ చేయడం ఆ నేతకు అలవాటు లేదు. అలాగని అపజయాలు ఆయన్ని ఎప్పుడు పలకరించే సాహసం చేయలేకపోయాయి. విజయాల పరంపరకు ఫుల్‌స్టాప్ లేకుండా ముందుకు సాగుతున్న ఆయన ఈసారి కొత్త సీటులో మళ్లీ కర్చీఫ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన అక్కడ పోటీ చేస్తే ఏపీలో పొలిటికల్ బీపీ పెరగడం ఖాయం.
మాజీ మంత్రి, విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం.. చిత్రం భళారే విచిత్రం. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోని ఆయన గెలిచిన చోట మళ్లీ పోటీ కూడా చేయకపోవడం మరో విశేషం. ప్రతి ఎన్నికకు ఆయన సీటు మారిపోతుంటుంది. కొత్త సీటులో సరికొత్త కర్చీఫ్ వేసి మరీ గెలవడం గంటా స్పెషాలిటీ. ప్రతి ఎన్నికల్లో కొత్త సీటులో ఆయన విజయగంట మోగించడం ఆనవాయితీగా మారింది. 1998లో రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఉద్దండులని ఓడించడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు గంటా. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా 2014లో తిరిగి టీడీపీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా 2019లో విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యేగా వరుస విజయాలని సాధించారు గంటా శ్రీనివాస్.
మిగిలిన పొలిటీషియన్స్‌కి డిఫరెంట్‌గా ఉండే గంటా 2024లో ఎక్కడ్నించి పోటీ చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా వైసీపీలోకి వెళ్తారనే చర్చ గతంలో చాలాసార్లు జరిగింది. చాలా ముహూర్తాలు కూడా వినిపించాయి. అయితే ఎవరు మోకాలడ్డారో కానీ ఆయన వైసీపీ గడప తొక్కలేకపోయారు. అయితే ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా భీమిలి అసెంబ్లీ సీటు నుంచి బరిలో దిగేందుకు గంటా డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. 2014లో ఆయన భీమిలి నుంచి గెలిచి టీడీపీ సర్కార్‌లో విద్యా శాఖా మంత్రిగా చేశారు. తనకు మంత్రి పదవి వచ్చేలా చేసిన సీటు కాబట్టి భీమిలిలో గంట కొట్టేందుకు రెడీ అవడానికి ఆ సెంటిమెంట్ కూడా ఒక కారణం కావచ్చంటున్నారు. భీమిలి టీడీపీ అభ్యర్థి పేరు ఇంకా ప్రకటించకపోయినప్పటికీ గంటా ట్రాక్ రికార్డ్ చూస్తే తాను కోరుకున్న సీటులో పోటీ చేయడం ఆయనకు నల్లేరుపై నడక. సర్వే కూడా తనకు అనుకూలంగా రావడంతో భీమిలిలో విజయగంట మోగిస్తాననే ధీమాలో ఉన్నారట ఈ మాజీ మంత్రి
భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. అందుకనే 2019లో లోకేష్ పోటీ చేసే స్థానాల కోసం సురక్షిత నియోజకవర్గంగా భీమిలి పేరు కూడా అప్పట్లో వినిపించింది. ఇక గంటా తాను గతంలో పోటీ చేసిన ఐదు నియోజకవర్గాల్లోని కేడర్‌తోనూ సత్సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారట. భీమిలి నుంచి పోటీ చేసే ఆలోచనని పార్టీ పెద్దలు ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారట గంటా. గంటా కనక భీమిలి నుంచి బరిలో దిగితే అక్కడ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌తో ఢీ అంటే ఢీ అనేలా సమరం తప్పదంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇద్దరు నేతలు కాపులు కావడం, నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి బలమైన ఓట్ బ్యాంక్ ఉండడమే కాకుండా…ఒకప్పటి మిత్రులు ఇప్పటి శత్రువులు అయిన గంటా, అవంతి మధ్య పోటీ జరిగితే అది నెక్ట్స్ లెవెల్ అంటున్నారు విశ్లేషకులు. పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తే ఈ ఇద్దరిలో కాపులు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి భీమిలిలో భూకంపం వచ్చేలా పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుతుందంటున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో భీమిలి హాట్ సీటుగా మారే చాన్స్ ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..