గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై అధికార పార్టీపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్య నేత నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవాలనే కుట్ర జరగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ఇందుకు కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలే నిదర్శనమని ఆరోపించారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనను పార్టీలకు ఆపాదిస్తున్నారని ఆక్షేపించారు. సంఘటనను రాజకీయాలకు ఆపాదించే వారు మనుషులు కాదని మండిపడ్డారు. ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయన్న నక్కా ఆనంద్ బాబు.. సంఘటన జరిగిన వెంటనే వైసీపీ నాయకులు పరామర్శ, సోషల్ మీడియా యాక్టివ్ కావటం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు మాట్లాడని మహిళ కమిషన్ చంద్రబాబు పై విమర్శలు చేయడానికి మాత్రం ముందు ఉంటుందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కాగా.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరులో చేపట్టిన చంద్రన్న సంక్రాంతి కానుక వస్త్రాల పంపిణీ తీవ్ర విషాదం నింపింది. తొక్కిసలాట జరగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. స్పాట్‌లోనే ఒక మహిళ చనిపోయింది. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కానుకలను పంచేందుకు 15 కౌంటర్లు పెట్టారు. చంద్రబాబు ప్రసంగం పూర్తై వెళ్లిపోయిన తర్వాత.. సంక్రాంతి కానుకలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ సమయంలో ముందు వైపు ఉన్న బారికేడ్ విరిగిపోవడంతో మహిళలు కిందపడిపోయారు. వారి మీద కొంత మంది పడటంతో ఊపిరి ఆడక స్పృహ తప్పిపడిపోయారు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. గాయపడిన వారిని జీజీహెచ్ కు తరలించారు. అక్కడ నుంచి శ్రీ ఆస్పత్రికి 8 మందిని.. ప్రజా ఆస్పత్రికి 8 మందిని తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఘటనపై స్పందించిన చంద్రబాబు.. ముగ్గురు చనిపోవడం బాధాకరంగా ఉందన్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ తరపున ఆర్ధిక సాయం ప్రకటించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..