Kodali Nani: యమ రథంతో ప్రజలను చంపుతున్నారు.. చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
చంద్రబాబు సభలో ముగ్గురు మహిళల మృతిపై మాజీ మంత్రి కొడాలి నాని సోమవారం స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Kodali Nani on Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మరణించిన విషయం తెలిసిందే. కందుకూరు ఘటన మరువక ముందే.. మరో తొక్కిసలాట జరగడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. గుంటూరు ఘటనకు చంద్రబాబు పబ్లిసిటీయే కారణమంటూ అధికార వైసీపీ నాయకులు మండిపడుతుండగా.. టీడీపీ మాత్రం భద్రతా లోపమంటూ కౌంటర్ ఇస్తోంది. కాగా, చంద్రబాబు సభలో ముగ్గురు మహిళల మృతిపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సోమవారం స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కానుకలిస్తామని చెప్పి ముగ్గురు మహిళల ప్రాణాలను బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఏడాది చివర ఎనిమిది మందిని, ప్రారంభంలో ముగ్గురిని బలుగొన్న నరరూప రాక్షసుడు చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శని గ్రహాన్ని మించిన, జామాతా దశమగ్రహం చంద్రబాబు అంటూ ఆరోపించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదంటూ కొడాలి నాని డిమాండ్ చేశారు.
మొదలు, చివర తెలియని ఎన్నారైలు నిర్వహించిన ఇలాంటి కార్యక్రమానికి బుద్ధున్న వాళ్ళు ఎవరు వెళ్లరంటూ పేర్కొన్నారు. తమనేరాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ సభలకు సూచనలు చేస్తే, పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని గగ్గోలు పెడతారన్నారు. నూటికి నూరు శాతం చంద్రబాబు పిచ్చితోనే మరణాలు సంభవించాయంటూ పేర్కొన్నారు.
ప్రతి ఎన్నికలో ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని గెలవడమే చంద్రబాబుకు తెలుసు, స్వయంగా ఆయనకు గెలవడం కల అంటూ పేర్కొన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉండదని.. శూన్యమని ఈ సందర్భంగా నాని పేర్కొన్నారు. బిఆర్ఎస్ వల్లే నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని.. జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయవచ్చంటూ పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ సింగల్ గానే పోటీ చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ వైసిపి అంటూ వివరించారు. అంశాల వారీగానే జాతీయ పార్టీలకు మద్దతు ఇస్తామే తప్ప, వైసీపీకి ఎవరితో పొత్తులు ఉండవంటూ స్పష్టంచేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..