కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం నిత్య కల్యాణం పచ్చ తోరణం అన్న చందంగా ఉంటుంది. స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలా అనునిత్యం తిరుమల క్షేత్రం భక్త పారవశ్యంతో ఎల్లప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. దానికి తగినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎప్పటికప్పుడు కీలక చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. అలాంటి తిరుమల క్షేత్రంలోనే.. ఓ భక్తుడు వడ్డీ కాసుల వాడి హుండీకే కన్నం పెట్టాడు.. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. వివరాల ప్రకారం.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తమిళనాడుకు చెందిన భక్తుడు దొంగలా మారాడు. దేవదేవుడి హుండీపైనే కన్నేసి చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరా మానిటరింగ్ చేస్తున్న జ్ఞానేంద్ర అనే ఆపరేటర్ గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో భక్తుడు ముసుగులో వచ్చిన దొంగ వ్యవహారం బయటపడింది. హుండీ చోరీకి పాల్పడ్డ భక్తుడుని పట్టుకుని అతని నుంచి రూ 15 వేలు స్వాధీనం చేసుకున్నారు.
అతన్ని తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.. అనంతరం తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు విజిలెన్స్ అధికారులు. ఈ ఘటన ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ పారిపోయాడని తేల్చారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా చోరీ జరిగినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారని, నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..