AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నమయ్యకు అరుదైన గౌరవం.. అమెరికాలో 111 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు!

భారతీయ భక్తి సంగీతానికి చిరస్మరణీయమైన పేరు తాళ్లపాక అన్నమాచార్య. ఆయన కీర్తనలు, రచనలు శతాబ్దాలుగా భక్తిని, సాహిత్యాన్ని, సంగీతాన్ని ఒకే తాటిపై నిలిపాయి. ఇప్పుడు అదే మహానుభావుడికి విదేశీ నేలపై అరుదైన గౌరవం దక్కబోతోంది. అమెరికాలోని టెనెసీ రాష్ట్రం, మెంఫిస్‌లో 111 అడుగుల ఎత్తైన పంచలోహ మహావిగ్రహ నిర్మాణం జరగబోతుంది.

అన్నమయ్యకు అరుదైన గౌరవం.. అమెరికాలో 111 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు!
Annamacharya Statue
B Ravi Kumar
| Edited By: |

Updated on: Mar 28, 2026 | 11:20 PM

Share

అమెరికాలోని టెనెసీ రాష్ట్రం, మెంపిస్ నగరంలో ఉన్న ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నమయ్యకు అంకితంగా 111 అడుగుల ఎత్తైన మహావిగ్రహం నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజల మద్దతుతో ఈ నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. అన్నమయ్య కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా భక్తి సంగీతానికి ప్రతీకగా నిలిచిన నేపథ్యంలో, ఆయనకు ఈ స్థాయిలో గౌరవం లభించడం విశేషంగా భావిస్తున్నారు.

సుమారు 75 టన్నుల పంచలోహంతో ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నత్తారామేశ్వరానికి చెందిన శిల్పి పెనుగొండ కరుణాకర్ ఉడయార్ ఆధునిక 3D సాంకేతికతతో దీన్ని రూపొందిస్తున్నారు. విగ్రహాన్ని ఒక్కసారిగా కాకుండా విడి భాగాలుగా తయారు చేసి, వాటిని నౌక ద్వారా అమెరికాకు తరలించే ప్రణాళిక సిద్ధమైంది. ప్రత్యేకంగా 160 టన్నుల బలమైన ఉక్కు చట్రంపై ఈ విగ్రహాన్ని అమర్చి తుది రూపం ఇవ్వనున్నారు.

ఇప్పటికే విగ్రహానికి సంబంధించిన భాగాల తయారీ ప్రారంభమైంది, భారీ పాదాల నిర్మాణం పూర్తయ్యింది. వాటి పరిమాణం చూసినవారికి ఈ విగ్రహ వైభవం ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. ప్రణాళిక ప్రకారం 2028 మే 9న అన్నమయ్య జయంతి సందర్భంగా ఈ మహావిగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మెంపిస్ నగరం భారతీయ భక్తి సంప్రదాయానికి ఒక ముఖ్య కేంద్రంగా మారే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us