హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హర్యానాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఈ ఘటన అత్యంత విషాదకరం. చేతికొచ్చిన కుమారుడిపై కొండంత ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను ఈ వార్త ఒక్కసారిగా కుంగిపోయేలా చేసింది. వెళ్లొస్తానమ్మా అని ఇంటి నుంచి బయలుదేరిన కొడుకు తిరిగి వస్తాడని ఎదురుచూస్తుండగానే అతడు ఇక లేడనే వార్త విని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.. తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తూ జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది.. బేతవోలు ప్రాంతానికి చెందిన బండ్ల మోహన్ రావు తన కుమారుడు రిషికేశ్‌ను ఎంతో కష్టపడి చదివించారు. చదువులో రాణించిన రిషికేశ్ మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. ఇటీవలే హైదరాబాద్ నుంచి హర్యానాకు వెళ్లి, పంచకుల సమీపంలోని పింజౌర్‌లో ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. దాదాపు రూ.9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగంలో చేరి కొత్త జీవితం ప్రారంభించాడు…
అయితే, ఉద్యోగంలో చేరి పది రోజులు కూడా పూర్తికాకముందే విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం అతడు తన గదిలో రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించడం సంచలనంగా మారింది. పోలీసులకు అనుమానాస్పద పరిస్థితులు మృతదేహంపై మెడ, చేతుల వద్ద కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. గదిలోని వస్తువులు చెల్లాచెదురుగా ఉండటం, టీవీ కింద పడిపోవడం వంటి పరిస్థితులు అక్కడ తీవ్రంగా పెనుగులాట జరిగినట్లు సూచిస్తున్నాయి. గోడపై రక్తంతో I am unable to call police అని రాసి ఉండటం కేసును మరింత అనుమానాస్పదంగా మారుస్తోంది..
గది తలుపులు లోపలి నుంచి లాక్ అయి ఉండటంతో మొదట ఆత్మహత్య కోణంలో పోలీసులు పరిశీలించినప్పటికీ.. గాయాల స్వభావం చూస్తే ఇది ప్రణాళికాబద్ధమైన హత్య కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుమారుడి ఆకస్మిక మృతి వార్తతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.




