AP News: అయ్య బాబోయ్ ఎలుకలు, దోమలు.. సరైన వసతులు లేక విద్యార్థుల ఆవేదనలు..

ఎలుకలు కొరుకుతున్నాయ్‌.. దోమలు కుడుతున్నాయ్‌.. బాత్‌రూముల్లో నీళ్లు రావడంలేదు.. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు.. మెస్‌లో భోజనం చేయడం కన్నా పస్తులుండటం మేలు. ఇలా అయితే మేం చదువుకోవాలా.. వద్దా.. ఇదీ ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటి విద్యార్దుల ఆవేదన. సమస్యలు పరిష్కరించాలంటూ గత కొన్న నెలలుగా హాస్టల్‌ వార్డెన్లకు, ఇన్‌చార్జిలకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.

AP News: అయ్య బాబోయ్ ఎలుకలు, దోమలు.. సరైన వసతులు లేక విద్యార్థుల ఆవేదనలు..
Ongole Iiit

Edited By:

Updated on: Feb 26, 2024 | 6:22 PM

ఎలుకలు కొరుకుతున్నాయ్‌.. దోమలు కుడుతున్నాయ్‌.. బాత్‌రూముల్లో నీళ్లు రావడంలేదు.. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు.. మెస్‌లో భోజనం చేయడం కన్నా పస్తులుండటం మేలు. ఇలా అయితే మేం చదువుకోవాలా.. వద్దా.. ఇదీ ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటి విద్యార్దుల ఆవేదన. సమస్యలు పరిష్కరించాలంటూ గత కొన్న నెలలుగా హాస్టల్‌ వార్డెన్లకు, ఇన్‌చార్జిలకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. సహనం నశించి సామూహికంగా క్లాసులు బహిష్కరించి క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. విద్యార్దుల ఆందోళనకు విద్యార్ది సంఘాల నేతలు, టిడిపి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ సంఘీభావం ప్రకటించారు.

ఒంగోలు ట్రిపుల్ ఐటి క్యాంపస్‎లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సామూహికంగా తరగతులు బహిష్కరించి ప్రధాన గేటు దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వసతుల లేమి కారణంగా ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్దులు ఆరోపిస్తున్నరు. దోమలు, ఎలుకలతో బాధపడుతున్నామని వాపోయారు. క్యాంపస్‌లో చేరిన తరువాత ఇప్పటికే వంద మంది విద్యార్దులను ఎలుకలు కొరికాయని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫ్యాకల్టీలకు, ఇన్‌చార్జిలకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకొని క్యాంపస్ వద్దకు చేరుకున్న మీడియాను చూసి సెక్యూరిటీ సిబ్బంది కాలేజి ప్రధాన గేట్లను మూసివేశారు. గేటు లోపలినుంచే విద్యార్దులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలంటూ మీడియా ప్రతినిధులను వేడుకున్నారు. క్యాంపస్‌ ఆవరణలో ఆందోళన చేస్తున్న విద్యార్దులకు నచ్చజెప్పి రూముల్లోకి తీసుకెళ్ళేందుకు ఫ్యాకల్టీ ప్రయత్నించారు. అయితే విద్యార్దులు మాత్రం తమ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అన్నీ అరకొర వసతులే..

2019 ముందు వరకు ఒంగోలు ట్రిపుల్‌ ఐటి క్యాంపస్‌ కడప జిల్లా ఇడుపలపాయలో కొనసాగింది. అక్కడ పిల్లల సంఖ్య పెరగడంతో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఒంగోలులోనే తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఒంగోలులో మూతపడిన రావ్ అండ్ నాయుడు కళాశాల భవనాన్ని ముందుగా అద్దెకు తీసుకొని తరగతులు ప్రారంభించారు. ఏటా కొత్త బ్యాచ్‌లు వస్తుండటంతో అది సరిపోక ఆ తరువాత ఏడాది కర్నూలు రోడ్డులోని ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలను అద్దెకు తీసుకున్నారు. రావ్ అండ్ నాయుడు కళాశాలలో 1,400 మంది, ఎస్ఎస్ఎన్ కాలేజిలో మరో 3 వేల మంది విద్యార్థులుంటున్నారు. ఇంజినీరింగ్ కళాశాలకు అనువుగా నిర్మించిన భవనాలు కావడంతో వసతికి అనువైన సౌకర్యాలు ఈరెండు చోట్ల లేవు. తగినన్ని మరుగుదొడ్లు.. దుస్తులు శుభ్రం చేసుకునేందుకు, ఆరబెట్టుకోడానికి తగిన జాగా లేదు.

ఇవి కూడా చదవండి

కిటికీలకు మెష్లూ కనిపించవు. దీంతో దోమల బెడదతో విద్యార్థులు అల్లాడుతున్నారు. వీటన్నింటికంటే నీరు, భోజనం సమస్య వారిని నిత్యం వేదనకు గురిచేస్తోంది. మెస్‌ ఛార్జీల కింద తమ దగ్గర రోజుకు రూ.80 రూపాయలు వసూలు చేస్తూ కూడా సరైన భోజనం పెట్టడం లేదని వాపోతున్నారు. వీటికి తోడు ఇక్కడ ఎలుకల బెడద ఎక్కువగా ఉంటోందని, ఎన్నిసార్లు ఇన్‌చార్జిలకు చెప్పినా వినడం లేదని విద్యార్దులు వాపోతున్నారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటి క్యాంపస్‌లో విద్యార్దులు చేస్తున్న ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్ది సంఘాల నేతలు, టిడిపి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌లు సంఘీభావం తెలిపారు. క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్దుల దగ్గరకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే విద్యార్దుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకుంటే విద్యార్ధుల ఆందోళనకు మద్దతుగా తాము కూడా ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని నిర్వాహకులను హెచ్చరించారు. విద్యార్దుల సమస్యలను వెంటనే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ విద్యార్దులకు హామీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us