BR Ambedkar Statue: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. బీఆర్ అంబేడ్కర్ డిసెంబరు 6, 1956లో కన్నుమూశారు. ప్రతి ఏడాది అంబేద్కర్ వర్దంతిని పురస్కరించుకొని ‘మహాపరినిర్వాన్ దివస్’ గా నిర్వహిస్తూ.. ఆయనకు నివాళులర్పించడం అనావాయితీగా వస్తోంది. కాగా.. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. తెనాలిలో మరో అద్భుతం ఆవిష్కకృతమైంది. సూర్య శిల్పశాల.. భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దింది. వేలాది విగ్రహాలను తయారు చేసిన ప్రముఖ సూర్య శిల్పశాల శిల్పులు ఐరన్ స్క్రాప్‌తో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని తయారు చేశారు. 14 అడుగుల ఎత్తు, మూడు టన్నుల ఐరన్ స్క్రాప్ తో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. మూడు నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు శిల్పి రవి చంద్ర తెలిపారు.
అంబేద్కర్ 66వ వర్థంతి సందర్భంగా తయారు చేసిన విగ్రహాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ ఆవిష్కరించారు. గతంలోనూ సూర్య శిల్పశాల శిల్పులు వెంకటేశ్వరరావు, రవిచంద్ర మోడరన్ ఆర్ట్స్ లో భాగంగా ఐరన్ స్క్రాప్ తో అద్భుతమైన కళా ఖండాలను తయారు చేశారు. అతి పెద్ద వీణ, తబల, మహాత్మ గాంధీ విగ్రహాలను నిర్మించారు. ఈ ఏడాది ఐరన్ బోల్ట్ లు, నట్టులతో మోడీ విగ్రహాన్ని తయారు చేసి చూపరులను అబ్బురపరిచారు. బెంగుళూరుకు చెందిన నేతలు నరేంద్ర మోడీ విగ్రహాన్ని తయారు సూర్య శిల్పశాల శిల్పులతో చేయించారు.
అప్పటినుంచి సూర్య శిల్పులు మరిన్ని జాతీయ నాయకుల విగ్రహాలను ఐరన్ స్క్రాప్ తో తయారు చేస్తున్నారు. ఆటోనగర్ లో స్క్రాప్ కొనుగోలు చేసి వాటిని వేరుచేసి అవసరమైన స్క్రాప్ తో విగ్రహాలు చేస్తున్నట్లు రవి చంద్ర వెల్లడించారు. మోడరన్ ఆర్ట్స్ పై అభిమానం ఉన్న వారి ప్రోత్సాహంతోనే కొత్త, కొత్త ప్రయోగాలు చేస్తున్నామని రవిచంద్ర తెలిపారు.
నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు.
Also Read: