
అసలే ఘాట్ రోడ్డు… ఆపై బస్సు నిండా ప్రయాణీకులు. ఏమాత్రం తేడా వచ్చినా బస్సు లోయలో పడేదే. అయితే డ్రైవర్ సమయస్పూర్తిగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న 62 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా నిలిచాయి. దోర్నాల – శ్రీశైలం ఘాట్‌రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం కొద్దిసేపు జనాన్ని యమ టెన్షన్ పుట్టించింది. ఘాట్ రోడ్డులో నెమ్మదిగా వస్తున్న ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సుతో కొండను ఢీకొట్టించి నిలువరించాడు. దీంతో బస్సు కొండ పక్క గుంతలో పడి ఆగిపోయింది.
పక్కకు ఒరిగిన బస్సులో ప్రయాణీకులు హాహాకారాలు చేశారు. ప్రాణభయంతో కిటీకీల నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించారు. అటుగా వెళుతున్న వాహనదారులు బస్సులో చిక్కుకున్న ప్రయాణీకులను కిటికీల నుంచి సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బస్సు శ్రీశైలం నుండి డోన్ కు వెళ్తుండగా మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో చింతల దగ్గరకు రాగే ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా, బస్సు లోని 62 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను మరొక బస్సులో దోర్నాలకు తరలించారు. శ్రీశైలం మల్లన్న దయ వల్లే పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నామని ప్రయాణికులు అంటున్నారు. ఇక ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాద ఘటనతో ఘాట్ రోడ్డు లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.