దేశానికే గర్వకారణంగా చెప్పుకునే భారత అంతరిక్ష ప్రయోగ కేంద్ర(SHAR)లో ఇప్పుడు ఆత్మహత్యల పర్వం నడుస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగుతోంది.. నిన్న(జనవరి 17) తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో సీఐఎస్‌ఎఫ్ సీఐ వికాస్‌సింగ్, కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకుని మరణించిన వికాస్ సింగ్‌ను చూడడానికి ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన భార్య ప్రియా సింగ్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించారు. అధికారులు తెలిపిన సమాచారం మేరకు ఈ రోజు(జనవరి 18) నర్మద గెస్ట్ హౌస్‌లో ప్రియాసింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకొని వికాస్‌సింగ్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఉత్తర ప్రదేశ్ నుంచి అన్న, పిల్లలతో కలిసి శ్రీహరికోటకు చేరుకున్న ప్రియాసింగ్ భర్త మృతదేహం వద్ద కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ క్రమంలోనే ఆమె మంగళవారం శ్రీహరికోటలోని నర్మద అతిథి భవన్‌లో ఆమె బస చేశారు. వికాస్ సింగ్ మృతిపై స్థానిక పోలీసులు రాత్రి ప్రియాసింగ్‌ను విచారించారు. అనంతరం అతిథి భవనంలో బంధువులతో కలిసి అక్కడే ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ఆమె గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇద్దరు మృతదేహాలను శ్రీహరికోట నుంచి పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. భర్త మరణాన్ని తట్టుకోలేకే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
కాగా, సీఐ వికాస్ సింగ్, ప్రియాసింగ్ దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. ఇక వీరిలో వికాస్ కుమార్తె వికలాంగురాలు కావడం శోకనీయం. 2015 బ్యాచ్‌కు చెందిన వికాస్ శిక్షణానంతరం ముంబయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తూ.. గతేడాది నవంబరులో బదిలీపై శ్రీహరికోటకు వచ్చారు. ముంబయిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో క్రమశిక్షణ చర్యలకు గురైనట్లు తెలిసింది.
ఇక వికాస్‌సింగ్ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారు. అందుకు ఉన్నతాధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు. వికాస్ ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోనే.. షార్‌లోని జీరోపాయింట్ రాడార్ సెంటర్‌కు సమీప అటవీప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మహషముండ్ జిల్లా శంకర విలేజ్ అండ్ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా శ్రీహరికోటలో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..