AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీసిటీ టిల్ హెల్త్ కేర్‌లో ఘోర ప్రమాదం.. బాయిలర్ బ్లాస్ట్‌తో నలుగురు కార్మికులు మృతి!

శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో ఘోర బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి షిఫ్ట్‌లో దాదాపు 30 మంది పని చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

శ్రీసిటీ టిల్ హెల్త్ కేర్‌లో ఘోర ప్రమాదం.. బాయిలర్ బ్లాస్ట్‌తో నలుగురు కార్మికులు మృతి!
Sri City Boiler Explosion
Balaraju Goud
|

Updated on: Oct 03, 2026 | 10:29 AM

Share

తిరుపతి జిల్లా శ్రీసిటీలో భారీ పేలుడు సంభవించింది. సత్యవేడు మండలంలోని శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న టిల్ హెల్త్ కేర్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అయితే మృతుల సంఖ్యపై శ్రీసిటీ యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో నైట్‌ షిఫ్ట్‌ కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి పలువురు కార్మికులు గాయపడగా.. వారిని వెంటనే శ్రీసిటీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పేలుడు జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలు, పరిశ్రమలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

ఈ ఘటనపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీసిటీలోని ప్రైవేటు పరిశ్రమలో బాయిలర్‌ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదమని అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు లోకేశ్‌ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us