AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాలో జడ్జీలను ట్రోల్ చేయడంపై AP హైకోర్టు సీరియస్.. DGPకి కీలక ఆదేశాలు

జడ్జిలపై అభ్యంతరకర పోస్టులపై కొన్ని రోజుల క్రితం న్యాయవాదులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. జడ్జీలపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ పంపింది. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది.

సోషల్ మీడియాలో జడ్జీలను ట్రోల్ చేయడంపై AP హైకోర్టు సీరియస్.. DGPకి కీలక ఆదేశాలు
Andhra Pradesh High Court
Janardhan Veluru
|

Updated on: Sep 27, 2023 | 6:07 PM

Share

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు, కేసుల వ్యవహారంలో జడ్జిలను ట్రోల్‌ చేసిన వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ విచారణ సందర్భంగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న సహ 26 మందికి నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీని హైకోర్టును ఆదేశించింది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన పిటిషన్లు విచారించిన జడ్జిలు, వారి కుటుంబీకులపై రాజకీయపరంగా ఉద్దేశపూర్వకంగా దూషణల పర్వం కొససాగుతోందని ఏపీ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో బుధవారంనాడు విచారణ జరిగింది. హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు జడ్జి కుటుంబం టార్గెట్‌గా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ నడిచిందని ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించారు. దురుద్దేశపూర్వకంగా జడ్జీలపై ట్రోలింగ్‌ చేశారని తెలిపారు. జడ్జీలపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.  ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌లో టీడీపీ నేత బుద్ధా వెంకన్న సహ 26 మందిని ప్రభుత్వం ప్రతివాదులుగా ఉన్నారు.

ట్రోల్‌ చేసిన సోషల్‌ మీడియా ఖాతాలు పరిశీలించి వారికి నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. జడ్జీలపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో టీడీపీ నేతలు  బుద్ధా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అడ్వకేట్ ఎస్ రామకృష్ణ సహా ప్రతివాదులుగా ఉన్న 26 మందికి ఇప్పుడు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. అంతే కాదు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న  గూగుల్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

జడ్జిలపై అభ్యంతరకర పోస్టులపై కొన్ని రోజుల క్రితం న్యాయవాదులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. జడ్జీలపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ పంపింది. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..