Andhra Pradesh: బైక్‌పై వెళ్తుండగా కాళ్లకు చుట్టుకున్న త్రాడు.. ఏంటని చూడగా ఒక్కసారి భయంతో..!
చెట్టులోనూ, పుట్టలోనూ పాములుంటాయనుకుంటాం. కానీ అప్పుడప్పుడూ అవి ఇళ్లలోకి వచ్చేసి మరీ మనల్ని హడల్ కొడతాయి. అసలే ఇప్పుడు ఎండాకాలం..
చెట్టులోనూ, పుట్టలోనూ పాములుంటాయనుకుంటాం. కానీ అప్పుడప్పుడూ అవి ఇళ్లలోకి వచ్చేసి మరీ మనల్ని హడల్ కొడతాయి. అసలే ఇప్పుడు ఎండాకాలం కావడంతో వేసవి తాపంతో, దాహం వేసి విష సర్పాలు, వన్యప్రాణాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయ్. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటంటే.?
వివరాల్లోకి వెళ్తే.. ఏలూరులోని నూజివీడులో ఓ వ్యక్తి బైకులోకి జెరిగొడ్డు పాము దూరింది. పార్క్ చేసిన బండికి కీ పెట్టి స్టార్ట్ చేసి రయ్‌మని వెళుతుంటే ఏదో తన కాలికి చుట్టుకున్నట్టు వాహనదారుడికి అనిపించింది. ఏంటని చూడగా హడలిపోయి.. వెంటనే భయంతో బండిని నడిరోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు. స్థానికంగా నివాసముంటున్న సతీష్ అనే డ్రైవర్ చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో ఓ మెకానిక్ షెడ్ వద్ద తన బైక్‌ను పార్క్ చేశాడు. కొంచెం సేపటి తర్వాత పని చూసుకుని సతీష్ తన బైక్ తీసుకుని వెళ్తుండగా ఓ పాము తన బైక్‌లో నుంచి వచ్చి సతీష్ కాళ్లకు చుట్టుకుంది. దీంతో సతీష్ బైక్ వదిలి భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. కాసేపటికి ఆ పాము కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అయితే మళ్లీ సతీష్ తన బైక్ వద్దకు వచ్చి బైక్ తీస్తుండగా పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. దాంతో శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని పరిశీలించాడు. అయితే తన బైక్ సీట్ కింద మరొక పాము బుసలు కొడుతూ కనిపించింది. మళ్లీ సతీష్ ఒక్కసారిగా బైకును కింద పడేసి అక్కడి నుంచి పరుగులు తీశాడు. దాంతో అక్కడికి స్థానికులు చాకచక్యంగా బైక్ సీట్ తొలగించి పామును బయటకి వచ్చేలా చేశారు. అనంతరం కర్రలతో దాని కొట్టి చంపారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడున్న స్థానిక వాహనదారుల సైతం తమ బైకుల్లో కూడా ఏమైనా పాములు ఉన్నాయా అని ఒకసారి పరిశీలించారు.