ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంగన్‌వాడీ కేంద్రంలో తాడు మెడకు చుట్టుకుని ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో జరిగింది. గొల్లెపాలంలోని అంగన్‌వాడీ కేంద్రంలో తాడు మెడకు చుట్టుకుని చంద్రశేఖర్ అనే బాలుడు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. తూకం వేసే ఉయ్యాల తాడు మెడకు చుట్టుకుని ఊపిరి ఆడక అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగన్‌వాడీ టీచర్ సెలవుల్లో ఉండడంతో ఆమె సహాయకురాలు కేంద్రంలో విధులు నిర్వహిస్తుంది. మొదట ఆయా కొందరు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకువచ్చింది. అనంతరం మరికొందరు చిన్నారులను తీసుకువచ్చేందుకు పిల్లల ఇళ్లకు వెళ్లింది. ఈ క్రమంలో బాలుడు తలుపులు తీసుకుని వెళ్లి తూకం ఉయ్యాల ఎక్కాడు. అయితే, దానికున్న తాడు బాలుడి మెడకు చుట్టుకుంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
తమ కుమారుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..